అడుగుకో.. గుంత ప్రయాణం చింత

 

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 30 (జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రహదారులు గుంతల మయంగా మారాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏ కొంచెం వర్షం పడిన ప్రయాణం కష్టతరం అవుతుంది. చాలాచోట్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులకు, పిల్లలకు రోడ్డు అడ్డంగా తవ్విన గుంటలతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళే వాహనదారులు గుంతల వల్ల ప్రమాదానికి గురవుతున్నారు.

అడుగడుగూ… గుంతల మయం రహదారి నరక ప్రాయం:

అంతర్గత రోడ్లు ఎవరి ఇష్టానుసారంగా వారు రోడ్డున అడ్డంగా తవ్వి వదిలేస్తున్నారు. దీనికి తోడు ఏ కొంచెం వర్షం పడిన గుంతలో నీరు చేరి కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మునిసిపాలిటీ పరిధిలో సుందరయ్య నగర్, భగత్ సింగ్ నగర్, బాలాజీ నగర్, పైలెట్ కాలనీ శివలింగాపురం లో అడుగడుగు గుంతలమయం రహదారి నరకప్రాయంగా మారింది. వర్షం పడితే రోడ్లపై నీరు చేరి ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలు గురవుతున్నారు. పూల సెంటర్ నుంచి కొత్త మల్లె పెళ్లి వెళ్లే రహదారిలో చేపల మార్కెట్ వద్ద రోడ్డు దుస్థితి దారుణంగా ఉంది. ఆ గుంతల్లో నుంచి వాహనాదారులు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఈదారిలో మల్లెపల్లి ఉపరితల గనికి రాత్రి వేళల్లో వెళ్లే సింగరేణి అధికారులు, కాంట్రాక్టు కార్మికులకు గుంతలు కనిపించక రోజుకో ప్రమాదం జరుగుతోంది.దీనివల్ల వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన స్పందించకపోవడంతో వాహనదారులు అవస్థలు తప్పడం లేదు.

దుమ్ము ధూళితో ఆరోగ్య సమస్యలు:

మల్లె పల్లి నుంచి బిటి పి ఎస్ వెళ్లే రహదారిలో నిత్యం రద్దీగా తిరిగే బొగ్గు ఇసుక లారీల తాకిడికి పైకి లేస్తున్న దుమ్ము ధూళి కణాల వల్ల రోడ్డు పక్కన నివాసముంటున్న వారికి అసహనం, చికాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వాహనాల మోత తో పాటు హారాన్ మోత తోడవ్వడంతో చెవులు చిల్లులు పడుతున్నాయని రాజుపేట వాసులు చెబుతున్నారు. అతి సూక్ష్మ ధూళి కణాలు మనిషి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. వాహనదారులు పాదాచారులు ఎక్కువగా దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరేణి, మున్సిపాలిటీ వారు నీటి ట్యాంకర్లు ఉన్నప్పటికీ వినియోగించటం లేదు. సింగరేణి అధికారులు మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి వాహనాల వేగ నియంత్రణ, దుమ్ము లేవకుండా నీటిని ట్యాంకర్ల ద్వారా చల్లటం వల్ల కొంత ఉపశమనం ఉంటుందని స్థానికలు అంటున్నారు.

తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి:
సిపిఐ పట్టణ కార్యదర్శి దుర్గ్యాలా సుధాకర్

వర్షాల దెబ్బకు దెబ్బతిన్న అంతర్గత రోడ్లపై ప్రయాణాలు చేసేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, ఎవరి ఇస్తానుసారంగా వారు రోడ్లన్నీ తవ్వకుండా చర్యలు చేపట్టాలి. అధికారులు ప్రజల రవాణాను దృష్టిలో ఉంచుకొని రోడ్లు బాగు చేసేలా చర్యలు తీసుకోవాలి. అన్నారంలో వీధిలైట్లు వెలగక రాత్రివేళ వెళ్లే కార్మికులకు గుంతలు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. మున్సిపాలిటీ ఎలక్ట్రిషన్ కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తు చేయాలని కోరారు.