అడ్డంకులను అదిగమించి ఢిల్లీలోకి రైతులు

– డిసెంబర్‌3న చర్చలకు పిలవాలని డిమాండ్‌

దిల్లీ,నవంబరు 27(జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ నిరసన ర్యాలీ శుక్రవారమూ కొనసాగుతోంది. హరియాణా, పంజాబ్‌ నుంచి వచ్చే రహదారుల్లో భారీ స్థాయిలో బలగాల్ని మోహరించినప్పటికీ.. అన్నదాతలు దిల్లీ శివారుల్లోకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లను సైతం తొలగించుకుంటూ ముందుకు నడిచారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘చలో దిల్లీ’ చేపట్టిన రైతులను ఎట్టకేలకు దిల్లీ పోలీసులు దేశ రాజధానిలోకి అనుమతించారు. అయితే, పోలీసుల పహారాలోనే వారంతా నగరంలోకి రావాలని షరతు విధించారు. బురారీ ప్రాంతంలోని నిరంకారీ సమగం మైదానంలో నిరసన తెలిపేందుకు అనుమతించారు. దిల్లీ సరిహద్దులోని సింఘు ప్రాంతం వద్ద నిన్నటి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన విషయం తెలిసిందే. పంజాబ్‌, హరియాణా తదితర చోట్ల నుంచి వచ్చిన వేలాది మంది రైతులపై పోలీసులు జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించినా అన్నదాతలు వెనకడుగు వేయలేదు. మొక్కవోని పోరాట దీక్షతో రైతులు దిల్లీ సరిహద్దుల్లోనే నిరసన తెలిపారు. ఈ క్రమంలో రైతు సంఘాలు ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశాయి. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తమను రామ్‌లీలా మైదానంలోకి అనుమతించాలని విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వ యంత్రాంగంతో చర్చల అనంతరం పోలీసులు రైతులకు అనుమతించారు. అయితే, పోలీసులు ఇంకా రైతులపై జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు రైతుల నిరసనల నేపథ్యంలో దిల్లీలోని మైదానాలను తాత్కాలిక జైళ్లుగా మార్చేందుకు అనుమతించాలని పోలీసులు దిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి కేజ్రీవాల్‌ సర్కార్‌ నిరాకరించింది. పంజాబ్‌, హరియాణాతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌కు చెందిన రైతులు కూడా ‘చలో దిల్లీ’ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. నిన్న ఆయా రాష్ట్రాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలు అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కొన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి రైతుల్ని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయినా, వారు వినకపోవడంతో జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో నిన్న హరియాణాలోని పానిపట్‌, శంభు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాటిని ఏమాత్రం ఖాతరు చేయని అన్నదాతలు నేడు ఉదయానికి దిల్లీ శివారుల్లోకి చేరుకున్నారు. బృందాలుగా విడిపోయి నగరంలోకి ప్రవేశించేందుకు ఉన్న అన్ని మార్గాల వద్ద రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇసుక లారీలు, సిమెంటు బారికేడ్లు, ముళ్ల కంచెలు, జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగాలతో శుక్రవారమూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఆరు మెట్రో స్టేషన్లను మూసివేశారు. పలువురిని అరెస్టు చేశారు. అయినా, ప్రభుత్వంతో చర్చలు జరిపే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అంతకుముందు హరియాణా ముఖ్యమత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కేంద్రంతో రైతులు చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం అందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మరోవైపు వెంటనే రైతులతో చర్చలు జరపాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా దిల్లీ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.