అడ్డంకులు, అవాంతరాలు మనకు కొత్తకాదు

ఏకీరాస్తా సడక్‌బంద్‌
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (జనంసాక్షి):ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు కల్పించినా ‘సడక్‌బంద్‌’ కార్యక్రమం నిర్వహించి తీరతామని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ స్పష్టం చేసింది. సడక్‌ బంద్‌ను దిగ్విజయవంతం చేసి తెలంగాణ ఆకాంక్ష ఎంతగా ఉందో ప్రభుత్వానికి చాటిచెబుతామని తెలిపింది. శాంతియుతంగా నిర్వహించే ఈ నిరసన కార్యక్రమానికి అడ్డంకులు కల్పించవద్దని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. అడ్డుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సడక్‌ బంద్‌ కార్యక్రమ నిర్వహణ, ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు గురువారం జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. సడక్‌బంద్‌ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం కోదండరాం విూడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలిపారు. తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించ తలపెట్టిన ‘సడక్‌బంద్‌’ కార్యక్రమానికి తెలంగాణ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం నెలలోపు నిర్ణయం ప్రకటిస్తామని హావిూ ఇచ్చి వెనక్కు పోయినందుకే ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కేందప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకోనందుకు సడక్‌బంద్‌ కార్యక్రమాన్ని చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 24న ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రయాణాలు వాయిదా వేసుకొని తెలంగాణ ప్రజలు, విద్యార్థులు సడక్‌బంద్‌లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అందరూ సడక్‌బంద్‌కు సహకరించాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్‌, 108 లాంటి అత్యవసర సేవలకు సడక్‌బంద్‌ నుంచి మినహాయింపునిస్తున్నామని కోదండరాం తెలిపారు. సడక్‌ బంద్‌లో పాల్గొనే కార్యకర్తలు, విద్యార్థులు అంబులెన్స్‌ లాంటి సర్సీసులకు మానవతా దృక్పథంతో తోవ ఇవ్వాలని ఆయన కోరారు. శంషాబాద్‌ నుంచి ఆలంపూర్‌ వరకు పన్నెండు కేంద్రాల వద్ద సడక్‌బంద్‌ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా జేఏసీలకు ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతను అప్పగించాలని స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించిందని కోదండరాం తెలిపారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకే తెలంగాణ సరిహద్దుల్లో సడక్‌బంద్‌ చేస్తున్నామని తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.