అడ్డగోలుగా మట్టి తవ్వకాలు,పట్టించుకోని సిబ్బంది

దౌల్తాబాద్, జూలై 7, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో గల కొత్త కుంట లో నుండి అక్రమ మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. దౌల్తాబాద్ మండలంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న మట్టి మాఫియాపై జనం సాక్షి ప్రత్యేక కథనం. అధికారుల అండదండలతో మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో గల కొత్త కుంట లో మట్టి గ్రావెల్ తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ కుంటలో నుండి మట్టిని అక్రమంగా తరలించి వేలాది రూపాయలను దోచుకుంటుంది మెట్కాన్ బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ మెట్టు నుండి దౌల్తాబాద్ వరకు రోడ్డు విస్తరణ పనుల కాంట్రాక్టును చేజిక్కించుకుంది.ఆ పనులలో భాగంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిన వందల ట్రిప్పులు మట్టిన అక్రమంగా తరలిస్తున్నది. సంబంధిత రెవెన్యూ అధికారులను వివరణ కోరగా, ఇరిగేషన్ శాఖ అధికారుల పరిధిలోని విషయం అని చెప్పారు,సదరు ఇరిగేషన్ ఏఈ నీ వివరణ కోరగా కొత్త కుంట లో నుండి మట్టిని తరలించడానికి ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. కాగా సదరు కాంట్రాక్ట్ కంపెనీ వారిని అడగగా అధికారులు అనుమతి ఇచ్చారని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టడంతో పాటు, మరో వైపు సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు.ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు అనుమతి లేదంటూ చెప్పడం,కాంట్రాక్టు కంపెనీ అనుమతి ఉందని చెప్పడం చూస్తుంటే కోత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.