అతిపెద్ద ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవం

C

– భారత రాజ్యాంగం మా పవిత్ర గ్రంధం

– కాలపరీక్షను ఎదుర్కుని నిలబడ్డాం

– 129 కోట్ల ప్రజలు సంపూర్ణ స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నారు

– అమెరికాకు భారత్‌ నమ్మకమైన భాగస్వామి

– ఈ బంధం ఉన్నత శిఖరాలకు చేరింది

– అమెరికా చట్ట సభలనుద్దేశించి ప్రధాని మోదీ

వాషింగ్టన్‌: అతిపెద్ద ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం అక్కడి చట్టసభలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగామోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన అబ్రహాం లింకన్‌ సూక్తులను ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. భారత రాజ్యాంగం మా పవిత్ర గ్రంధమని ఆయన తెలిపారు.’అమెరికా.. ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటింది. ఇక్కడ నేను ప్రసంగించడమంటే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవం. ఎంతో మంది త్యాగాల ఫలితంగా అమెరికా జాతి తలెత్తుకుని నిలబడగలిగింది. మానవజాతి శాంతియుత జీవనానికి అమెరికా చేసిన సేవ వెలకట్టలేనిది. ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసం ఇరుదేశాల మైత్రిని బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ రెండూ అతిపెద్ద ప్రజాస్వామ్యాలను ఏకతాటిపై నడిపిస్తాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రజాస్వామ్యం నిలబడుతుందా? అని చాలా మంది అనుమానించారు. కాల పరీక్షను ఎదుర్కొని భారత ప్రజలు దానిని నిలబెట్టుకున్నారు.’ అని మోదీ ఉద్ఘాటించారు.ఇంకా ఆయనేమన్నారంటే.. ‘125 కోట్ల భారత ప్రజలు ప్రతిక్షణం సంపూర్ణ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నారు. తోరోస్‌ ప్రతిపాదించిన సహాయ నిరాకరణ మా రాజకీయ తత్వాన్ని మార్చి వేసింది. స్వామి వివేకానంద చికాగో ప్రసంగం భారతీయ సంస్కృతి, ఉన్నతిని ప్రపంచానికి చాటింది. అంబేడ్కర్‌ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది కొలంబియా వర్సిటీలో చదువుకున్న రోజులే. అమెరికా రాజ్యాంగం ఆయన విూద అపార ప్రభావాన్ని చూపింది. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతం.. మార్టిన్‌ లూథర్‌కింగ్‌ను ప్రభావితం చేసింది. భారత్‌, అమెరికాలు సహజ మిత్రులని వాజ్‌పేయీ అన్న మాట నిత్య సత్యం. ఒక్కొక్కటిగా బలపడుతూ వచ్చిన భారత్‌, అమెరికా బంధం ఇవాళ ఉన్నత శిఖరాలకు చేరింది. భారత్‌ కష్టంలో ఉన్నప్పుడు అమెరికా అందించిన సాయం ఎన్నటికీ మర్చిపోదు. ముంబయి దాడుల తర్వాత బాసటగా నిలిచిన అమెరికాను భారత జాతి ఎన్నటికీ మరవదు. ఏ దేశంతో పోల్చినా భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు అత్యంత ప్రభావంతమైనవి’ అని అన్నారు.

యోగాపై మేథో హక్కులు కోరం!

‘ప్రపంచానికి భారత్‌ యోగాను అందించినందుకు గర్వపడుతున్నా. భారతీయ యోగా సంప్రదాయాన్ని అమెరికాలో 30 మిలియన్ల మంది అభ్యసిస్తున్నారు. భారతదేశం యోగా విూద మేథో హక్కులను కోరుకోవడం లేదు. ఇవాళ అమెరికాలో గొప్ప శాస్త్రజ్ఞలు, సీఈవోలు, వ్యోమగాముల్లో ఎంతో మంది భారతీయులు ఉన్నారు. అమెరికా స్పెల్‌బీ ఛాంపియన్లు కూడా భారత సంతతి వారవుతున్నారు. భారతదేశంలో గొప్ప నౌకాశ్రయాలు, రైలు, రోడ్డు మార్గాలు నిర్మించాలని నిర్దేశించుకున్నాం. 21వ శతాబ్దపు నవ నిర్మాణాలను నిర్దిష్ట సమయంలో చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అభివృద్ధి చెందిన అనేక రంగాల్లో భారత్‌.. అమెరికాకు నమ్మకమైన భాగస్వామి అవుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.

ఉగ్రవాదానికి చట్టబద్ధత ఉండకూడదు!

‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు భారత్‌ కట్టుబడి ఉంది. ఆఫ్రికా నుంచి మహాసముద్రం విూదుగా పసిఫిక్‌ వరకు శాంతి పరిరక్షణలో భారత్‌ ముందుకు నడుస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంతీయ సమతుల్యం కాపాడటంతో భారత్‌ కీలక భూమిని నిర్వహిస్తోంది. తూర్పు పశ్చిమ ప్రపంచానికి వారధిగా ఉన్న ఈ ప్రాంతాన్ని భారత్‌ కంటికి రెప్పలా కాపాడుతుంది. మధ్య ప్రాచ్యంలో శాంతి పరిరక్షణకు అమెరికా చేస్తున్న కృషిని, అఫ్గానిస్థాన్‌లో భారత్‌ కృషిని నేడు ప్రపంచం గుర్తించింది. అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాద నిరోధానికి భారత్‌, అమెరికా కృషి ప్రపంచానికే తలమానికం. ఉగ్రవాద మూలాలను పెకిలించాలన్న ఉమ్మడి ఆశయం నెరవేరే సమయం ఆసన్నమైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, అనుసరిస్తున్న వారందరూ శిక్షార్హులే. ఉగ్రవాదంపై పోరాడాలన్నది అనేక స్థాయిల్లో జరగాల్సిన అంశం. మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం ఉండదు. ఉగ్రవాదానికి చట్టబద్ధత అనేది ఎక్కడా ఉండదు.. ఉండకూడదు.. భారత్‌, అమెరికాల స్నేహబంధం కొత్త అవకాశాలకు నాందిగా నిలుస్తుంది.’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

అమెరికా చట్ట సభలనుద్దేశించి ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్‌, సభ్యులకు, అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి భారత్‌ కొత్త చోదక శక్తిగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. కష్టించి పనిచేసే యువ జనాభా కలిగిన భారత్‌.. భవిష్యత్‌ ప్రపంచపు మానవ వనరుల సరఫరా శక్తి అని వివరించారు. భారత్‌లోని అపార అవకాశాలను వివరించిన మోదీ.. పెట్టుబడులతో రావాలని అమెరికా వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. అమెరికా పెట్టుబడులు, సృజన.. భారతీయ మానవ వనరులు, వ్యవస్థాపకత మధ్య భాగస్వామ్యం ఎంతో శక్తిమంతంగా ఉంటుందని భావిస్తున్నానని అన్నారు.  అలాంటి భాగస్వామ్యం ద్వారా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని బలోపేతం చేయొచ్చని నమ్ముతున్నా. భారత్‌ను మార్చే దిశగా మేం ప్రయాణం ప్రారంభించాం. 1/6వ వంతు జనాభా కలిగిన భారత్‌ను మార్చడం అంటే ప్రపంచాన్ని మార్చడమే. ఆ ప్రయాణం సుదీర్ఘంగా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు సాధించిన ఫలితాన్ని చూస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనన్న విశ్వాసం కలుగుతోంది. ఆ ప్రయాణంలో విూరు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నా. ఆ ప్రయాణం విూ సంస్థ లాభాన్ని పెంచుకునేందుకు మాత్రమే కాదు.. మెరుగైన భారత్‌ను, మెరుగైన అమెరికాను, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేందుకు అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్‌-అమెరికా పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.  అమెరికా-భారత్‌ భాగస్వామ్యం ఎంతో శక్తిమంతంగా ఉంటుంది. ఇరు దేశాల భాగస్వామ్యంతో ఆర్థికవ్యవస్థ మరింత బలోపేతం కానుంది. భారత్‌ను మార్చే దిశగా తాము ఇప్పటికే ప్రయాణం ప్రారంభించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు.