అతిపెద్ద బాంబ్ : బంకర్స్‌తో స‌హా 36మంది టెర్ర‌రిస్టులు హ‌తం

ఆఫ్ఘానిస్తాన్‌లో ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ను వారి స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని నిన్న అమెరికా అతిపెద్ద బాంబును ప్ర‌యోగించిన ఘ‌ట‌న‌లో 36 మంది ఐసిస్ ఉగ్ర‌వాదులు మృతిచెందిన‌ట్లు ఆఫ్ఘానిస్తాన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో కేవ‌లం ఉగ్ర‌వాదులు మాత్ర‌మే మృతిచెందార‌ని సాధార‌ణ పౌరుల‌కు ఎలాంటి హాని జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. న‌న్‌గ‌ర్హార్ ప్రాంతంలో బంక‌ర్ల‌ను, గుహ‌ల‌ను నివాసంగా చేసుకుని ఐసిస్ ఉగ్ర‌వాదులు అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇక్క‌డి నుంచే ప‌లు దేశాల‌నుంచి యువ‌కుల‌ను ఐసిస్ నియ‌మించుకుంటోంది. మ‌న దేశంలోని కేర‌ళ రాష్ట్రానికి చెందిన 20 మంది యువ‌కులు ఐసిస్‌కు ఆక‌ర్షితులై న‌న్‌గ‌ర్హార్ లోని ఐసిస్ క్యాంపుల్లో చేరిన‌ట్లు స‌మాచారం.

అమెరికా పాల్ప‌డిన ఈ దాడిలో మ‌న‌దేశ యువ‌కులు కూడా ఉండిఉంటార‌ని మ‌న అధికారులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు మృతి చెందిన‌ట్లు త‌మ వ‌ద్ద స‌మాచారం ఉంద‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అక్క‌డి ప‌రిస్థితుల‌ను స్ట‌డీ చేసేందుకు త్వ‌ర‌లో ఓ బృందం ఆఫ్ఘానిస్తాన్‌కు వెళుతుంద‌ని భార‌త ఇంటెలిజెన్స్ సంస్థ వెల్ల‌డించింది.