అత్యాచార బాలిక కుటుంబానికి న్యాయం చేయలేకపోయా

రాజీనామాతో చిత్తశుద్ది చాటిన ఎమ్మెల్యే

భువనేశ్వర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఓ ఎమ్మెల్యే నిబద్దత చాటుకున్నారు. పదవిలో ఉంటూ న్యాయం చేయనందుకు ఆవేదన చెందారు. సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాలిక కుటుంబానికి న్యాయం జరగడం లేదని భావించిన ఓ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి.. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నానని ఆ ఎమ్మెల్యే బాధపడి.. చివరకు ఆ పదవికి రాజీనామా చేసి తన నిజాయితీని చాటుకున్నారు. ఈ ఘటన రాజకయీ వర్గాల్లో తీవ్ర సంచనలం కలిగించింది. గతేడాది అక్టోబర్‌ 10న ఒడిశా కోరాపూట్‌ జిల్లాలోని ముసగుడా గ్రామంలో 14 ఏళ్ల బాలిక.. మార్కెట్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు.. ఈ ఏడాది జనవరి 22న ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఎన్నిసార్లు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ నిందితులను పోలీసులు అరెస్టు చేయడం లేదు. తన సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరిగి ఏడాది పూర్తయిన్నప్పటికీ.. నిందితులను అరెస్టు చేయకపోవడంపై కోరాపూట్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

కృష్ణ చంద్ర సగారియా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగడం లేదు. అలాంటప్పుడు తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఏం లాభం? ఒక బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయలేనప్పుడు ఎమ్మెల్యే పదవిలో ఉండటం సరికాదని భావించిన కృష్ణ చంద్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటనకు నిరసనగానే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు కృష్ణ చంద్‌ స్పష్టం చేశారు.