అత్యాశ పతనానకి చేటు

ఒక ఆశ పుట్టిందంటే, మానవుడు అంతటితో సంతృప్తి చెందడు. లభించిన వైభవం, సుఖశాంతులు చాలని అనుకోడు. ఇంకా ఏదో కావాలన్న తపన, ఆవేదన, నిరీక్షణతో సతమతమవుతుంటాడు. పొయ్యిలో ఒక్కో కర్ర పెడుతున్నకొద్దీ మంట పెరుగుతుంటుంది. అలాగే అతడి కోరికలు, ఆశలు తీరినా మనసులో కొత్తవి ఊరుతూనే ఉంటాయి. అప్పుడే ఆశ అత్యాశగా మారి, మనిషిని అధఃపాతాళం వైపు తీసుకెళుతుంది. ఆశ తృష్ణగా మారిందంటే, బతుకు పెడదారి పట్టిందన్నమాటే!అత్యాశ వైపు మనిషి చిత్రమైన పరుగు ‘భారతం’లోని యక్ష ప్రశ్నల్లో కనిపిస్తుంది. ఇంద్రుడు తన పదవి నిలబెట్టుకునేందుకు ఎందరో రుషుల తపస్సును భంగం చేయడానికీ వెనకాడలేదు. ధర్మమా, అధర్మమా అనే యోచనను అత్యాశ చెరిపివేసింది. స్త్రీ సౌందర్యానికి ప్రలోభం చెంది సుందోపసుందులు ఒకరినొకరు హతమార్చుకుంటారు. అమృతాన్నిసంగ్రహించాలన్న అత్యాశకు పోయి రాహుకేతువులు అంతరిస్తారు. అత్యాశ దురాశగా మారిందంటే, ఎదుటివాడికి ఎంతటి హాని చేయడానికైనా మనిషి సిద్ధపడతాడు. ఆశను అంతవరకే ఉంచాలి తప్ప, మృత్యుపాశంగా మార్చుకోకూడదు. ప్రమిదలోని వత్తి లాంటిది ఆశ. తగినంత తైలం పోస్తేనే వెలుగునిస్తుంది. వత్తి మునిగేలా నూనె పోస్తే, దీపం కొండెక్కి చివరికి చీకటే మిగులుతుంది. సదాశయం లేని ఆశ- వాసన లేని పువ్వు వంటిది. మనిషికి అది అనవసరం!