అత్యున్నత ప్రమాణాలతో మిషన్‌ భగీరథ నీటి శుద్ధి

మిషన్‌ భగీరథ, ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్మితా సభర్వాల్‌

హైదరాబాద్‌,నవంబర్‌11 (జనంసాక్షి):  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం అత్యున్నత ప్రమాణాలతో మిషన్‌ భగీరథలో నీటి శుద్ది జరుగుతోందని మిషన్‌ భగీరథ, ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్మితా సభర్వాల్‌ అన్నారు. మార్కెట్‌ లో దొరికే మినరల్‌ వాటర్‌ కంటే భగీరథ నీరే సురక్షితమన్నారు. ఎర్రమంజిల్‌ లోని మిషన్‌ భగీరథ కార్యాలయంలో చీఫ్‌ ఇంజనీర్లు, అన్ని జిల్లాల ఎస్‌.ఈలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గాల వారీగా మిషన్‌ భగీరథ నీటి సరఫరా తీరును సమీక్షించారు. జిల్లా ఎస్‌.ఈల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తెలుసుకున్నారు. ఇక గ్రామాల్లో జరుగుతున్న స్థిరీకరణ పనుల పురోగతిపై సంతప్తి వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో డిసెంబర్‌ చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ స్థిరీకరణ పనులు పూర్తయి, ప్రతీ ఒక్క ఇంటికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నీరు సరఫరా కావాలని ఆదేశించారు. ఇప్పటికే ఆదిలాబాద్‌ నుంచి అమ్రాబాద్‌ వరకు ఉన్న ఆదివాసీ గూడాలు, లంబడా తండాలకు మిషన్‌ భగీరథతో రక్షిత మంచినీరు అందుతోందన్నారు. ఇంక మిగిలిన 126 ఐసోలేటెట్‌(అటవీ, గుట్టల ప్రాంతాల్లో) ఆవాసాల్లో జరుగుతున్న నీటి సరఫరా పనులను మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి మిషన్‌ భగీరథతో స్వచ్చమైన నీరు సరఫరా అయినప్పుడే ప్రాజెక్ట్‌ లక్ష్యం నెరవేరినట్టన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికలు, వైకుంఠదామాలకు కూడా మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మిషన్‌ భగీరథ వాటర్‌ బాటిల్‌ లను వినియోగించడంపై అధికారులను స్మితా సభర్వాల్‌ అభినందించారు. ఇక నుంచి మిషన్‌ భగీరథ కార్యక్రమాలు, సమావేశాల్లో కచ్చితంగా భగీరథ బాటిల్‌ నీటినే వాడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఈ.ఎన్‌.సి కపాకర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్‌ తో పాటు మిషన్‌ భగీరథ చీఫ్‌ ఇంజనీర్లు, ఎస్‌.ఈలు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.