అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా..
జోరుగా వానలు
– ఎడతెరిపి లేని వర్షంతో పొంగిపొర్లుతున్న వాగులు
– సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు
– గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
అదిలాబాద్, ఆగస్టు16(జనం సాక్షి) : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలంగాణాలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండురోజుల క్రితం పడిన వర్షానికి వాగులు, వంకలు, పొంగి పొర్లుతున్నాయి. కాగా బుధవారం అర్థరాత్రి నుంచి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం పూర్తిగా స్థంభించింది. పలుచోట్ల లోలెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మరోవైపు జిల్లాలోని ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇదివరకే భారీ వర్షాలకు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోగా బుధవారం అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల వరద గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కురిసిన వర్షంతో పంటలకు జీవం పోసినట్లయింది. ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుండడంతో ఆదిలాబాద్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లోని శివారు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం ఈ నెలలో 654 విూల్లీ విూటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కురిసిన వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించగా, జలాశయాలు నిండిపోయాయి. జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు లోకి భారీగా వరద నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ఒక గేటు ఎత్తివేసి 1200 వందల క్యూసెక్కుల నీటిని వదిలారు. మరో వైపు పలుచోట్ల వాగులు పొంగి పొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇచ్చోడ మండలం ముక్రా కే వాగు పొంగి పొర్లడంతో ముక్రా కే గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే అదిలాబాద్ మండలంలోని బంగారుగూడ వద్ద వాగు పొంగిపొర్లడంతో సాత్నాల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పలు వాగులలోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో జలపాతాలు జల కళను సంతరించుకున్నాయి. పలు మండలాలలో జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలలోకి వరదనీరు చేరుకోవడంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి.
ఉమ్మడి కరీంనగర్‌లో భారీ వర్షాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పలు చోట్ల రోడ్లపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ పట్టణంలో ఉదయం నుంచి ముసురు కమ్ముకోవడంతో చిరు వ్యాపారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 148విూటర్లు కాగా 147.58 అడుగులకు చేరింది. దీంతో రెండు గేట్లు ఎత్తి 5900 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. అటు మానకొండూరు, సిరిసిల్ల, వేములవాడ, కోనరావుపేట, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి,ముస్తాబాద్ మండలాల్లో కూడా ఉదయం నుంచే ముసురు పెట్టింది. ధర్మపురి, బుగ్గారం మండలాల్లో వర్షం కురుస్తుండగా ధర్మన్నపేట వద్ద వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో రోడ్డుపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సారంగాపూర్, గోదావరిఖని, శంకరపట్నం మండలాల్లోనూ వర్షం కురిసింది. అదేవిధంగా ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మోస్తారు వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.