అది కేంద్రం ఘనత కాదన్న ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై,నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు వెల్లడించిన నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వంపై శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయోధ్య తీర్పును మోడీ సర్కార్‌ తన ఘనతగా  చాటుకోలేదని  ఉద్దవ్‌ అన్నారు. అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని మందిర నిర్మాణానికి ఏర్పాటు చేసే ట్రస్ట్‌కు అప్పగించాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే అందుకు నిరాకరించిందని, సుప్రీం తాజా తీర్పును ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోరాదని ఠాక్రే ఆక్షేపించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న సేన ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తోంది.