అది పత్రికల విషప్రచారం
– తెలంగాణ ఆర్థిక పరిస్థితి భేష్
– మంత్రి ఈటల
హైదరాబాద్,జులై22(జనంసాక్షి):
రాబోయే రోజుల్లో తెలంగాణ ఆదాయం మరింత బాగా పెరగనుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. సచివాలయంలో మంత్రి ఈటెల విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల మేరకే ఆదాయం పెరుగుతున్నదని తెలిపారు. తెలంగాణ ఆదాయంపై కొన్ని పత్రికలు చేస్తున్న విషప్రచారం నమ్మొద్దు అని సూచించారు. తెలంగాణ లోటు బడ్జెట్‌లో ఉందని, నిధులు లేవని చేస్తున్న కథనాలు అబద్దమన్నారు. మంత్రి తలసానితో కలసి ఆయన ఆర్థిక, వాణిజ్య పన్నుశాఖ అధికారులతో సవిూక్షించారు. తరవాత మాట్లాడుతూ అన్ని రంగాల్లో వృద్ధి రేటును సాధిస్తున్నామని స్పష్టం చేశారు. బడ్జెట్ అంచనాలను సాధించే దిశగా వృద్ధి రేటు కొనసాగుతోందన్నారు. ఖజానాలో డబ్బు లేదనడం అవాస్తవమన్నారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రమని పేర్కొన్నారు. సేల్స్‌ట్యాక్స్ వసూలు భారీగా పెరిగిందన్నారు. గతేడాది జూన్‌లో రూ. 2,265 కోట్లు వసూలైతే ఈ ఏడాది జూన్‌లో రూ. 2,425 కోట్లు వసూలైందని చెప్పారు.గతేడాది జులైలో రూ. 24 వందల కోట్లు వసూలైతే, ఈ ఏడాది జులైలో రూ. 2,650 కోట్లు వసూలైందని ప్రకటించారు. రెవెన్యూ ఇన్‌కం అంచనా 28 శాతం ఉంటే ఇప్పటికే 24 శాతం సాధించామని తెలిపారు. పరిశ్రమలకు అనుమతుల కోసం గతంలో పారిశ్రామికవేత్తలు చెప్పులు అరిగేలా తిరిగేవారు అని గుర్తు చేశారు. ఇప్పుడు 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని తెలిపారు. ఆదాయపుపన్ను శాఖకు 1,200 కోట్ల జమపై తాత్కాలిక ఇబ్బంది ఏర్పడిందని.. అయినప్పటికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆర్థిక నిర్వహణ చేపట్టినట్లు వెల్లడించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఆశించిన ఆదాయాన్ని సాధిస్తున్నట్లు మంత్రి తెలిపారు.