అద్దె అలవెన్సు కోసం జిల్లా కేంద్రాల్లో తిష్ట

ఎన్జీవో నేతలుగా బదిలీలు తప్పించుకునే యత్నం
తిరుపతి,జూలై 23(జ‌నంసాక్షి): కొందరు ఉద్యోగులు జిల్లా కేంద్రం వదలకుండా ప్రయత్నాలు చేసుకుని కుర్చీలకు అతుక్కుపోతున్నారు. కొందరు ఎన్జీవో నేతలుగా అవతారమెత్తుతున్నారు. దీంతో బదిలీలు తప్పించుకునే యత్నాలు చేస్తున్నారు. ఇంటిఅద్దె అలవెన్సుల్లో తేడాలుండడమేనని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. గ్రావిూణ ప్రాంతాల్లో పనిచేసేవారికి ఇంటి అద్దె అలవెన్సు 12శాతం, జిల్లా కేంద్రంలో పనిచేసే వారికి 20 శాతం అందుతుంది. ఈ ప్రకారం గ్రావిూణ ప్రాంతాల్లో పనిచేసే వారికీ, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారికీ మధ్య సుమారు  ఆరేడు వేల వరకు తేడా వస్తుంది. నెలనెలా ఆదాయం అధికంగా వచ్చేలా చూసుకోవడానికి జిల్లా కేంద్రంలోనే ఉండాలని కొందరు ఉద్యోగులు తీవ్రంగా ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తున్నారు. కొన్నేళ్లుగా కొన్ని ప్రధాన శాఖల్లో ఉన్నతాధికారులకు దగ్గరగా పనిచేసిన కొందరు అక్కడే తిష్ట వేస్తున్నారు. దాదాపు అన్ని శాఖల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దీంతో జిల్లా కేంద్రంలో ప్రధాన శాఖలకు వచ్చే ఉన్నతాధికారులు కూడా వీరికే ప్రాధాన్యమిస్తున్నారు. ఆ స్థానాల్లో కొత్తవారు వస్తే.. పరిస్థితులు అర్థం కావడానికి, అధికారికి అనుకూలంగా వ్యవహరించడానికి కొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. ఒకవేళ కొత్తవారు కీలకమైన స్థానాల్లోకి వస్తే వారు అన్ని విషయాలూ తెలుసుకునే సమయానికి ఆ శాఖ ఉన్నతాధికారులకు బదిలీలు వచ్చిన సందర్భాలూ లేకపోలేదు.  దీంతో బదిలీల్లో చాలామంది ఉద్యోగులు సీట్లు, ఊర్లు, జిల్లాలు మారుతున్నా కొందరు మాత్రం ఎక్కడికక్కడే అతుక్కుపోయి ఉన్నతాధికారులకు ఆదాయవనరులుగా మారుతున్నారు. ఏళ్లతరబడి ఒకేచోట ఉండడంతో అక్కడ ఆ అధికారి చెప్పిందే వేదమని పలువురంటున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు ఆ అధికారి ద్వారా పనులు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలున్నాయి.  విద్యుత్‌శాఖలో
ఇలాంటివారు చాలామంది ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. బదిలీల నేపథ్యంలో విద్యుత్‌ శాఖలో జోరుగా పైరవీలు కొనసాగుతున్నాయి. ఎవరి స్థాయిలో వారు బేరసారాలు సాగిస్తున్నారు. కొందరు   బదిలీ నిబంధనల నుంచి తప్పించుకోవడానికి కొందరు ఎన్జీఓ నాయకులుగా అవతారమెత్తుతున్నారు.