అద్భుతాలు సృష్టించే నడివయస్సులో ఉన్నాం

– ఒక కులానికో, ప్రాంతానికో తెదేపా పరిమితం కాదు
– ఆనంద ఆంధప్రదేశ్‌ తమందరి లక్ష్యం
– సంక్షేమ విప్లవం తెచ్చిన ఘనత తెదేపాదే
– గాజువాకలో గర్భిణీపై వైసీపీ నేతల దాడి అమానుషం
– వైకాపా అరాచకాలను అందరూ ఖండించాలి
– నేరగాళ్ల పార్టీ వైసీపిని చిత్తుగా ఓడించాలి
– త్వరలో మమతా, అఖిలేష్‌లు కూడా ప్రచారానికొస్తారు
– ప్రత్యేక ¬దాపై 22పార్టీల నేతలు అండగా ఉన్నారు
– బీజేపీ టీఆర్‌ఎస్‌, వైసీపీ మాత్రమే ఏపీకి వ్యతిరేకం
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మార్చి29(జ‌నంసాక్షి) : 38ఏళ్ల పూర్తి పరిపక్వతతో తెలుగుదేశం పార్టీ ఉందని, అద్భుతాలు సృష్టించే నడి వయసులో ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం తెదేపా కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. పారిశ్రామిక, క్షీర, హరిత విప్లవాల తరహాలోనే రాష్ట్రంలో సంక్షేమ విప్లవం తెచ్చిన ఘనత తెదేపాదేనని అన్నారు. పేదరికం లేని ఆనందదాయక సమాజం ఏర్పాటే తెదేపా లక్ష్యమని, ఈ సంక్షేమ విప్లవాన్ని ఎన్టీఆర్‌కు అంకితం చేస్తున్నామని చెప్పారు. తొలుత తెలుగుదేశం సభ్యులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వాడవాడలా పసుపు జెండా రెపరెపలాడాలని సీఎం ఆకాంక్షించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల మధ్య వేడుకగా జరపాలన్నారు. ఎన్టీఆర్‌ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. 38 ఏళ్లుగా తెదేపాని గుండెల్లో పెట్టుకొని, పసుపు జెండా భుజాన మోస్తున్న సైనికులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 8 ఏళ్ల చరిత్రలో ఏ పార్టీకీ దక్కని గౌరవం తెదేపాకి దక్కిందని, మొత్తం 23 ఏళ్ల అధికారం ప్రజల్లో తెదేపా ఆదరణకు నిదర్శనమన్నారు. ప్రజలే ముందు, సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు  అన్న ఎన్టీఆర్‌ బాటే తమ మార్గమని తెలిపారు. సంక్షేమంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, జనాభాలో 98 శాతం మందికి ప్రభుత్వ లబ్ధి అందడం ఒక చరిత్ర అన్నారు. 38 ఏళ్ల పూర్తి పరిపక్వతతో తెలుగుదేశం పార్టీ ఉందని, అద్భుతాలు సృష్టించే నడి వయసులో ఉన్నామన్నారు. సకల జనుల సౌభాగ్యం తెలుగుదేశం లక్ష్యమని స్పష్టంచేశారు. ఒక కులానికో, ఒక ప్రాంతానికో తెదేపా పరిమితం కాదని, చంద్రబాబు అందరివాడని అన్నారు. అన్నివర్గాల ప్రజలకు తెలుగుదేశం అండగా ఉంటుందని తెలిపారు. ఆనంద ఆంధప్రదేశ్‌ తమందరి లక్ష్యమని, అందరికీ ఆమోదయోగ్య పాలన ఇస్తామన్నారు. గాజువాకలో గర్భిణిపై వైకాపా నేతల దాడి అమానుషమని చంద్రబాబు అన్నారు. వైకాపా అరాచకాలను అందరూ ఖండించాలన్నారు. నేరగాళ్ల పార్టీ వైకాపాను చిత్తుగా ఓడించాలని, జగన్‌కు ఓటేస్తే నేరగాళ్లకు ఓటేసినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.
ఒత్తిడిలకు లొంగకండి..
తెదేపా ఐదేళ్ల పాలనలో అద్భుత పాలన సాగించామని, మళ్లీ అధికారంలోకి వస్తామని, ప్రజలందరికీ ఆమోదయోగ్య పాలన ఇస్తామని చంద్రబాబు అన్నారు. రాబోయే 13రోజులు అవిశ్రాంతంగా పనిచేయాలని, ఒత్తిడిలోనే వీరోచితంగా అందరం పోరాడాలని సూచించారు. వైసీపీ ప్రలోభాలకు
లొంగవద్దని, బీజేపీ, టీఆర్‌ఎస్‌ బెదిరింపులకు భయపడవద్దని, ఎంత అణగదొక్కితే అంత విజృంభించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కర్ణాటక మంత్రులపై ఐటీ దాడులు బీజేపీ వేధింపులకు పరాకాష్టకు చేరాయని, ఓటమి భయంతోనే బీజేపీ తప్పుల విూద తప్పులు చేస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయస్థాయి నేతలు రాబోతున్నారు..
వైకాపా అరాచకాలను అందరూ ఖండించాలని చంద్రబాబు అన్నారు. నేరగాళ్ల పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించాలని, జగన్‌కు ఓటేస్తే నేరగాళ్లకు ఓటేసినట్లేనన్నారు. దేశం దృష్టి మొత్తం ఆంధప్రదేశ్‌ పైనే ఉందన్నారు. రేపటి ఏపీ ప్రజాతీర్పు దేశానికే ఒక దిక్సూచి అవుతుందన్నారు. ఫరూక్‌ అబ్దుల్లా జమ్మూకశ్మీర్‌ నుంచి వచ్చి టీడీపీకి ప్రచారం చేశారని, అరవింద్‌ కేజీవ్రాల్‌ ఢిల్లీ నుంచి తరలివచ్చి టీడీపీకి ప్రచారం చేశారని, త్వరలోనే మమతా బెనర్జీ, అఖిలేష్‌ వస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దాపై 22పార్టీల నేతలు అండగా ఉన్నారని, బీజేపీ, టీఆర్‌ఎస్‌, వైసీపీ మాత్రమే ఏపీకి వ్యతిరేకమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గెలుపు మొత్తం దేశానికే మలుపు అని, బీజేపీని, దానితో అంటకాగే వైసీపీని చిత్తుగా ఓడించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.