అద్భుత ఘట్టాలు ఆవిష్కృతం

c

– తెలంగాణతో భుజం-  భుజం కలిపి పనిచేస్తాం

– ప్రధాని మోదీ

మెదక్‌,ఆగస్టు 7(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వం వెంట ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమర్థవంతంగా పని చేస్తున్నారు.తెలం గాణ అభివృద్ధి కోసం భుజం భుజం కలుపు కుని పనిచే స్తామని అన్నారు. భారతదేశంలో అత్యంత పిన్న వయస్సున్న రాష్ట్రం తెలంగాణ. నవజాత శిశువు అయిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. తెలంగాణ ప్రజల కలల సాకారానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాను.ఈనాటి కార్యక్రమం పంచశక్తుల ఆవిష్కారంగా తోచింది. భారత్‌, తెలంగాణ సర్కార్‌ కలిపి ఐదు ప్రాజెక్టులు ప్రారంభించడం సహకార సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుజం భుజం కలిపి పని చేస్తున్నాయి. ఫర్టిలైజర్‌, నీళ్లు, విద్యుత్‌ విషయంలో కేంద్రం, రాష్ట్రం కలిసి నడుస్తోంది.సీఎం కేసీఆర్‌ నన్ను కలిసినప్పుడల్లా తెలంగాణ అభివృద్ధి అంశాల విూదే చర్చించారు. తాగు, సాగునీరు అంశంలో కేసీఆర్‌ ఎప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇంటింటికీ, ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలన్న లక్ష్యం గురించే మాట్లాడుతుంటారు. నీరు విషయం ఎత్తితేనే కేసీఆర్‌ ఎంతో భావోద్వేగానికి లోనవుతారు. భారతీయ రైతు పొలానికి నీరందితే బంగారం పండిస్తారు. ప్రతి ఎకరానికి నీరందించేందుకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. బలమే జీవం, ప్రతి ఒక్క చుక్క నీటిని ఒడిసిపడితేనే భవిష్యత్‌. ప్రతీ నీటి బొట్టును వ్యవసాయానికి మళ్లిస్తే గ్రామాల్లో జీవన ప్రమాణాలే మారిపోతాయి. తాగునీటి సమస్య ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది.గుజరాత్‌లో ప్రతి ఇంటికి మంచి నీరు ఎలా అందించారో కేసీఆర్‌ అధ్యయనం చేశానని చెప్పారు. అలాగే తెలంగాణలో కూడా ఇంటింటికీ నీరిస్తామని సీఎం చెప్పారు. నీళ్లున్నంతా వరకు నీటి విలువ తెలియదు. నీళ్లను సంరక్షిస్తే కొత్త జీవితం ప్రారంభమవుతుంది. గాంధీ పుట్టిన స్థలం పోరుబందర్‌కు వెళ్లి చూడండి ఒక్కో నీటి బొట్టును ఎలా రక్షిస్తున్నారో చూడండి. రెండు వందల ఏండ్ల కిందట నీటి సమస్య లేకపోయినప్పటికీ నీటి విలువ తెలిసి సంరక్షించుకుంటు వస్తున్నారు.రెండేళ్లలో కరెంట్‌ సమస్య లేకుండా చేశాం. కరెంట్‌ లోటు ఉన్న రాష్ట్రాలు కూడా అవసరానికి మించి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే స్థాయికి తీసుకొచ్చాం. నిన్నటి వరకు విద్యుత్‌ కొరత ఉన్న రాష్ట్రాలూ ఇవాళ మిగులు విద్యుత్‌ రాష్ట్రాలుగా మారాయి. తెలంగాణ ఒకప్పుడు రూ. 11 యూనిట్‌ చొప్పున కరెంట్‌ కొనేది. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్‌ సంస్కరణల వల్ల ఇప్పుడు రూపాయి పది పైసలకు విద్యుత్‌ను కొంటున్నారు. నీళ్లు, సౌరశక్తి ప్రకృతి ప్రసాదించిన వరాలు. సోలార్‌ ఎనర్జీని ఒడిసిపడితే భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాలకు భరోసా ఉంటుంది. సోలార్‌ ఎనర్జీ సాయంతో మిషన్‌ భగీరథను ముందుకు తీసుకెళ్లామని సీఎంకు సూచించాను. దాని వల్ల కరెంట్‌ ఛార్జీలు తగ్గుతాయి.గతంలో ఉన్న ప్రధానులు కొత్తపల్లి రైల్వేలైన్‌ గురించి పట్టించుకోలేదు. ఆర్థిక అభివృద్ధి కోసం కనెక్టివీటి అత్యవసరం. అందుకే కొత్తపల్లి రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేశాం. రైల్వే ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి ఎన్నో ఏండ్ల ఆకాంక్షను నెరవేర్చుతాం. ఎంతో కాలంగా అడుగుతున్న తెలంగాణ రైలు మార్గాలను పూర్తి చేసి చూపిస్తాం.ఫర్టిలైజర్‌ల విూద గతంలో సబ్సిడీలు దొరికేవి. ఫర్టిలైజర్‌లు లేనప్పుడు సబ్సిడీలు ఇచ్చి ఏం లాభం? ఇంతకుముందు యూరియా ఫర్టిలైజర్స్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో కొనాల్సి వచ్చేది. క్యూలైన్లలో నిలబడ్డ కూడా యూరియా దొరికేది కాదు. గత రెండేళ్లుగా యూరియా గురించి ఏ ముఖ్యమంత్రి నాకు లేఖ రాయలేదు. యూరియా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రాష్ట్రాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. నీమ్‌ కోటింగ్‌ యూరియా వల్ల భూమి సారం పెరిగింది. రైతులకు సరసమైన ధరలకు ఎరువులు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఎరువులు అందుబాటులోకి తెచ్చేందుకే రామగుండం ఫర్టిలైజర్‌ ఎరువుల ఫ్యాక్టరీని పునఃప్రారంభించాం.రైతులకు భూమిని మించిన తల్లిలేదు. అందుకోసమే సాయిల్‌ టెస్టును ప్రవేశపెట్టాం. ఆవు మలమూత్రాలు కూడా భూమి సారాన్ని పెంచుతున్నాయి. ఆవును వ్యవసాయంతో అనుసంధానించాలి. భూమి ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆలమంద ఉంటే మన సంపద రెట్టింపయినట్టే.అమ్మ కొన్నేండ్లు పాలు ఇస్తది కానీ ఆవు మాత్రం జీవితాంతం పాలు ఇస్తదని గాంధీ చెప్పారని గుర్తు చేశారు. నకిలీ గో రక్షకులతో జాగ్రత్తగా ఉండండి. గో రక్ష పేరుతో సమాజంలో అలజడులు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. నకిలీ గో రక్షకుల బండారం బయటపెట్టాల్సిన బాధ్యత నిజమైన గో భక్తులపై ఉంది. ఏదో ఒక పేరు చెప్పి భారతీయ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు.అన్ని సమస్యలకు అభివృద్దే మందు. మనందరి భాష ఒకటే.. అదే అభివృద్ధి. అభివృద్ధితోనే మన అవసరాలు తీరుతాయి. అభివృద్ధిలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వం వెనుకాల ఉంటుంది. చేయి చేయి కలిపి నడుద్దాం. విూకు ఢిల్లీ దూరం లేదు. హైదరాబాద్‌ ఎంతో ఢిల్లీ కూడా అంతే’ అని మోడీ ప్రసంగం ముగించారు.