అధికారంలోకి రాగానే 2లక్షల రుణమాఫీ


దళితులను దగా చేసిన కెసిఆర్‌: జీవన్‌ రెడ్డి
జగిత్యాల,నవంబర్‌28(జనంసాక్షి): నాలుగున్నరేళ్ల ప్రభుత్వంలో దళితులకు తీరని అన్యాయం చేశారని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌ రెడ్డి ఆరోపించారు. దళితులకు 13 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని హావిూ ఇచ్చి.. కేవలం 15 వేల ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారన్నారు.  కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో మహాకూటమికి పూర్తి మెజారిటీనివ్వాలన్నారు. కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహించే సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై దాడులు నిర్వహించడమే గాకుండా పోలీసు కేసులు నమోదు చేసి ఆ కుటుంబాలను తీవ్రంగా హింసించినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని మండిపడ్డారు. మైనారిటీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. అత్యధికంగా తెలంగాణలో అట్టడుగు వర్గాల ప్రజలున్నారని, వారి సంక్షేమం కోసం ఇచ్చిన అనేక హావిూల అమలులో తెరాస వైఫల్యం చెందిందన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని, భూమిలేని దళితులకు మూడెకరాల స్థలాన్ని ఇస్తామని హావిూ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటిని విస్మరించి దళిత వ్యతిరేకిగా మారారని ఆరోపించారు. అప్పటి కాంగ్రెస్‌ ఎంపీల ఒత్తిడి, అమరుల త్యాగాలను దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. సచివాలయంలో కూర్చుని పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. అన్ని రంగాల్లో విఫలమైన కేసీఆర్‌ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.