అధికారం కోసం తండ్రీకొడుకుల మోసం

ఏ వర్గానికి న్యాయం చేయని కెసిఆర్‌

సోనియా కన్నీరు పెట్టిందే అందుకన్న రేవంత్‌

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాలని పిలుపు

రాజన్న సిరిసల్ల,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): తండ్రీకొడుకులు కెసిఆర్‌,కెటిఆర్‌ కలసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు ఒరగబెట్టిందేవిూ లేదన్నారు. సోమవారం ఆయన వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల పక్షాలన ప్రచారం చేపట్టి కెసిరా/- పాలనపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఇసుక దందా కోసం నేరెళ్ల దళితులను చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. అలాగే ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారని అన్నారు. అందుకే తెలంగాణలో లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టాలని రేవంత్‌ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తిమండలంలో కాంగ్రెస్‌ ప్రజా చైతన్య సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెరాసపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెరాస అభ్యర్థి చెన్నమనేని రమేష్‌ బాబు గెలిచినా, ఓడినా ఆయన జర్మనీలోనే ఉంటారని ఎద్దేవా చేశారు. కేవలం సెలవుల్లోనే ఆయన ఇక్కడకు వస్తారన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత అని సోనియా గాంధీ అని స్వయంగా కేసీఆరే అన్నారని, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన 1569 అమరుల కుటుంబాలకు కేసీఆర్‌ ఏం న్యాయం చేశారని ఈ సందర్భంగా రేవంత్‌ ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేతో ఏం సాధించారని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల వివరాల కోసం ఒక్క కాలమ్‌ కూడా అందులో కేటాయించలేదని.. పైగా, కుటుంబంలో కోళ్లు, కుక్కలు ఎన్ని ఉన్నాయన్న వివరాలు అడిగారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులైన తలసాని, తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చి.. దానం నాగేందర్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారని దుయ్యబట్టారు. మందుపోసిన సంతోష్‌కు పదవి ఇచ్చారని విమర్శించారు. నిత్యం ప్రజల్లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ను గెలుపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్క దొరైనా బలిదానం చేసుకున్నాడా? అని ప్రశ్నించారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను రాబందుల్లా పీక్కుతింటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. ప్రపంచ చరిత్రలోనే స్వాతంత్యం కోసం పోరాటాలు చేసిన వారెవరూ ఆస్తులు కూడబెట్టుకోలేదని, కేసీఆర్‌ మాత్రం వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారనే అంశంపై అమరవీరుల స్తూపం వద్ద హరీశ్‌రావు, కేటీఆర్‌ చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2లక్షల కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులు ఎక్కడికి పోయాయన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 58 ఏళ్లు నిండిన భార్యా భర్తలకు ఒక్కొక్కరికి రూ.2వేలు చొప్పున పింఛను ఇస్తామని హావిూ ఇచ్చారు. మహిళల్ని లక్షాధికారులుగా మారుస్తామన్నారు. సిరిసిల్లలో కొడుకు కోసం ఉద్యమనేత కెకె మహేందర్‌ రెడ్డికి ద్రోహం చేశారని అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, ఇంటింటికి నీరు, ప్రాజెక్టులు, మూడెకరాల భూమి ఇవ్వని టిఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఏ వర్గానికి న్యాయం జరగనప్పుడు ఎందుకు టిఆర్‌ఎస్‌ను మోయాలన్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తి కెటిఆర్‌ అన్నారు. ఈ సభలో భారీగా యువత పాల్గొన్నారు.