అధికారమే పరమావధిగా .. చంద్రబాబు రాజకీయాలు


– తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెదేపా తాకట్టుపెడుతోంది
– భాజపా నేత కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, నవంబర్‌1(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్నికలకు వెళ్లడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని తెలంగాణ భాజపా నేత కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెదేపా అని గుర్తు చేశారు. కానీ అధికారమే పరమావధిగా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీకి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెదేపా తాకట్టు పెడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదని విమర్శించారు. అధికారం కాపాడుకోవడం, కుర్చీని నిలుపుకోవడమే ఆయన లక్ష్యమన్నారు. నందమూరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నారావారి తెలుగుదేశం పార్టీగా మారిందని ఆక్షేపించారు. మహాకూటమి చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందని, కాంగ్రెస్‌ వ్యతిరేక శక్తులన్నీ ఈ విషయాన్ని గుర్తించాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఆంధప్రదేశ్‌ అవతరన దినోత్సవం రోజే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలవడం శోచనీయమన్నారు.  చంద్రబాబు తీరుతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభింస్తుందన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ కలయికను ఎన్టీఆర్‌ అభిమానులు ప్రశ్నించాలని కోరారు. చంద్రబాబుకి కావాల్సింది రాష్ట్రాభివృద్ధి కాదని, తన అధికారం కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌తో పోత్తుకు వెళ్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌, టీడీపీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.