అధికారాల హరింపుపై దిల్లీ అసెంబ్లీ అత్యవసర భేటీ
న్యూదిల్లీ, మే 23(జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ తో వివాదం నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరుస్తున్నారు సీఎం కేజ్రీవాల్. ఈ నెల 26,27 తేదీల్లో అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధులను పేర్కొంటూ కేంద్ర ¬ంశాఖ పంపిన నోట్ పై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా శకుంతలా గామ్లిన్‌ను నియమించటాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాము ప్రతిపాదించిన అధికారుల్లో ఒకరిని కాకుండా, వ్యతిరేకిస్తున్న అధికారిని పంపడం విడ్డూరమని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ తన పరిధి దాటి ప్రవర్తించారని విమర్శించారు. శకుంతల గతంలో విద్యుత్ డిస్కంలకు మద్దతుగా వ్యవహరించారని, అలాంటి అధికారిణి ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉంటే దిల్లీలో పరిపాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవాలని కేజ్రీవాల్ అంటున్నారు. తాము ముందు నుంచి ఆ అధికారిణిని వద్దని హెచ్చరిస్తున్నా బేఖాతరు చేయకుండా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆమెను నియమించటం వెనుక కేంద్రం హస్తముందని ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదం రోజురోజుకు చినికి చినికి గాలివానలా మారుతోంది. దీనిపై చర్చించేందుకు అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరుస్తున్నారు.