అధిక ఫీజులను నియంత్రించాలి
నిజామాబాద్,ఫిబ్రవరి18(జనంసాక్షి): జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని జిల్లా అధికారులకు పేరెంట్స్ విన్నవిస్తున్నారు. విద్యాసంవత్సరం ముగియకముందే అప్పుడే కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు మొదలయ్యాయి. ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు కూడా అంటున్నారు. వార్షిక పరీక్షలు సవిూపిస్తున్న నేపథ్యంలో ఫీజులు కట్టడం లేదని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని జిల్లా విద్యాశాఖాధికారి అన్నారు. అందరికీ సకాలంలో హాల్ టికెట్లు ఇవ్వాలన్నారు. దీనిపై డీఈ వో, ఆర్‌ఐవోలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో వసతి గృహాల్లో అన్నిరకాల వసతులు కల్పించాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉందన్నారు. పరీక్షల సమయంలో మాస్‌కాపీయింగ్ జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల పుట్టినరోజు వివరాలు అన్ని పక్కాగా ఉండాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో జన్మించిన పిల్లల బయోడేటా వివరాలు జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా నమోదు చేయించాలన్నారు. వీఆర్వోలు, మున్సిపల్ అధికారులు పూర్తి సమాచారం వివరాలతోనే ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు.