అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 9 : జిల్లాలోని మూడు ఎయిడెడ్ పాఠశాలలు నిబంధనలకు విరుద్దంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ మంగళవారం ఆర్‌జెడికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని నిర్మల హృదయ విజయమేరీ, సెంట్‌జాన్స్ పాఠశాలలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ జరిపి నివేదిక అందజేసి సంవత్సరం గడుస్తున్న ఇప్పటి వరకు ఆ పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని జిల్లా కమిటీ అధ్యక్షుడు నవీన్ ఆరోపించారు. విద్యార్థుల నుంచి ఆ పాఠశాలలు వసూలు చేసిన ఫీజులను తిరిగి వారికి ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.