అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్‌ దూకుడు

సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల ప్రసంగం
క్రమంగా ప్రజల్లో పెరుగుతున్న మద్దతు
వాషింగ్టన్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి):  అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌, డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ ’డెమొక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌’లో సంప్రదాయానికి విరుద్ధంగా ఆశ్చర్యకర ప్రసంగం చేశారు. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థి కన్వెన్షన్‌ చివరి రోజున ప్రసంగం చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా మొదటి రోజునే మాట్లాడిన కమలా హ్యారీస్‌.. అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అమెరికాకు జీవితాంతం సేవ చేసిన అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బైడెన్‌కు తాను ఎన్నటికీ రుణపడి ఉంటానని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు చికాగోలో జరిగిన డెమొక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌ ప్రారంభోత్సవంలో కమలా హ్యారీస్‌ మాట్లాడారు. మన అద్భుతమైన అధ్యక్షుడు జో బైడెన్‌ గురించి మాట్లాడడం ద్వారా ఈ సమావేశాలను ప్రారంభించాలనుకుంటున్నాను. జో.. విూ చారిత్రాత్మక నాయకత్వానికి, దేశానికి జీవితాంతం సేవ అందించిన విూకు ధన్యవాదాలు. మేమంతా విూకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం అని కమలా హ్యారీస్‌ అన్నారు. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థి కన్వెన్షన్‌ చివరి రోజున ప్రసంగిస్తారు. కానీ హ్యారిస్‌ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఆశ్చర్యకరంగా తొలి రోజే మాట్లాడారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం కమలా హ్యారీస్‌ నినాదాలతో మార్మోగింది. మరోవైపు పార్టీ సమావేశ ప్రాంగణంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. కాగా డెమొక్రాటిక్‌ పార్టీ నామినీగా అధికారికంగా ఈ సమావేశాల్లో ఆమోదించనున్నారు. ఇదిలావుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు`2024లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారీస్‌ దూసుకుపోతున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కమల గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించేందుకు ’డెమొక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌’ సిద్ధమవుతున్న వేళ కమల, డెమొక్రాటిక్‌ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని కలిగించే వార్త వచ్చింది. ’ది అసోసియేటెడ్‌ ఎన్‌వోఆర్‌సీ సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ అ్గªర్స్‌ రీసెర్చ్‌ తాజాగా నిర్వహించిన పోల్‌లో పెద్ద వయస్కుల్లో ఆమె ఆదరణ గణనీయంగా పెరిగింది. తాజా పోల్‌ ప్రకారం..అమెరికా పెద్దల్లో దాదాపు 48 శాతం మంది కమలా హ్యారీస్‌ వైపు మొగ్గుచూపుతున్న ట్టు తేలింది. గతంతో 39 శాతం మంది మద్దతు మాత్రమే లభించగా ప్రస్తుతం దాదాపు సగం మంది ఆమె వైపే మొగ్గుచూపుతున్నారని పోల్‌ డేటా పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్‌ తప్పుకున్నప్పుడు కమలా హ్యరీస్‌కు కేవలం 39 శాతం మంది మాత్రమే మద్దతు పలికారని, ఇప్పుడు ఆదరణ గణనీయంగా పెరిగిందని పోల్‌ సర్వే పేర్కొంది. ఇంతకాలం మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పట్ల పెద్ద వయస్కులు సానుకూల అభిప్రాయంతో ఉన్నారంటూ అంచనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం 41 శాతం మంది పెద్ద వయస్కులు మాత్రమే ట్రంప్‌ను అధ్యక్షుడిగా కోరుకుంటున్నారు. అత్యధికులు కమలా హ్యారీస్‌నే కోరుకుంటున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్‌ పేరుని పరిశీలిస్తున్న సమయంలో ఆమె ఎవరో తెలియదని నాడు 12 శాతం మంది చెప్పగా.. ఇప్పుడు ఆ సంఖ్య 6 శాతానికి తగ్గిందని సర్వే గణాంకాలు స్పష్టం చేశాయి. జూన్‌ నెల నుంచి కమలా హ్యారీస్‌ మద్దతు క్రమక్రమంగా పెరుగుతోంది. అన్ని వర్గాల్లోనూ ఆమెకు ఆదరణ లభిస్తోంది. డెమోక్రాట్‌ పార్టీ సభ్యులతో పాటు తటస్థ ఓటర్లు, మహిళలు, 30 ఏళ్లలోపు యువతలో కమలా హ్యారీస్‌కు ఆదరణ స్వల్పంగా ఎక్కువగా కనిపిస్తోంది. నల్లజాతి వారు, స్పానిష్‌ మాట్లాడే సమూహాలు కూడా హ్యారీస్‌ వైపే మొగ్గుచూపుతున్నట్టుగా సంకేతాలు ఉన్నాయి. కాగా నవంబర్‌ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.