అనారోగ్యంలో 104 వ్యవస్థ
ఖమ్మం, అక్టోబర్ 25 : అపర సంజీవనిగా మారుతుందని భావించిన 104 వాహనాలు తీవ్ర అనారోగ్యంతో కునారిల్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉన్నప్పటికీ భద్రాచలం అటవీ ప్రాంతంలో పని చేస్తున్న 104 సిబ్బంది మరీ దారుణంగా బతుకు బండి లాగుతున్నారు. ప్రతినెల మొదటి వారంలో జీతాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులకు తోచినప్పుడు జీతాలు ఇస్తున్నారు. 2011 ఏప్రిల్ నుండి నవంబర్ వరకు, 2012 ఏప్రిల్ నుంచి నేటి వరకు రోజుకు 70 రూపాయల వంతున చెల్లించాల్సిన అలవెన్స్‌లు ఎప్పుడు ఇస్తారో చెప్పేనాధుడే లేరు. భద్రాచలం డివిజన్‌లో వివిధ వాహనాలు ఉండగా పూర్తిస్థాయిలో అన్ని గ్రామాల్లో వీరు తిరగలేకపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 70 మందిని అకారణంగా తొలగించగా 104 వాహన సిబ్బంది సంఘటితమై ఉద్యమించడంతో సగం మందిని విధుల్లోకి తీసుకున్నారు. మరో 36 మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది.