అనుకున్న సమయానికే మిషన్‌ భగీరథ

నీరందించకుంటే ఓట్లు అడగబోం

మాటకు కట్టుబడి ఉన్నమన్న వేముల

నిజామాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని అందించనున్నట్లు ప్రకటించిన మేరకు పనులు శరవేగంగా సాగుతున్నాయని భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేమలు ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. నీరివ్వకుంటే ఓట్లడగమన్న సిఎం కెసిఆర్‌ ప్రకటనకు కూడా కట్టుబడి ఉన్నామని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా శరవేగంగా పనులు పూర్తి కావస్తున్నాయని, అనేక గ్రామాలకు ఇప్పటికే మంచినీరు సరఫరా అవుతోందని అన్నారు. రైతులకు మొదటి విడత రుణమాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్‌దే అన్నారు. దీంతో రైతులు సంతృప్తిగా లేరని తెలుసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులను ఆదుకొని వారి కండ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ సందర్భంగా రైతులకు సంవత్సరానికి ఒక ఎకరానికి రూ.8వేల పెట్టుబడిని అందిస్తున్నారన్నారు. రైతులు ఈ డబ్బులతో సకాలం లో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారన్నారు. గతంలో రైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఎరువులు, విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తూ పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారని గుర్తు చేశారు. వితంతులు, వృద్ధులు, ఒంటరి స్త్రీలు, కార్మిక, చేనేత, బోదకాలు వ్యాధి గ్రస్తులను ఆదుకునేందుకు వారికి రూ.వెయ్యి నుంచి రూ.1500 పింఛన్లు అందిస్తున్నామన్నారు. కడుపులో ఉన్న బిడ్డను, తల్లిని రక్షించేందుకు ఆరోగ్య లక్ష్మి పథకంలో గర్భిణులకు ఒకపూట పౌష్ఠికాహారాన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అందజేస్తున్నామని తెలిపా రు. దీంతో పాటు అమ్మఒడి పథకంలో ప్ర భుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరుపుకొని పాప పుడితే రూ.13 వేలు, బాబు పుడితే రూ.12 వేలతో పాటు రూ.2వేల విలువ చేసే కేసీఆర్‌ కిట్‌ అందజేస్తున్నామన్నారు. కేజీ టూ పీజీ విద్యలో భాగంగా

అంగన్‌వాడీ కేంద్రాలకు పాఠశాలలను అనుసంధానం చేసి ఆంగ్లమాధ్యమంలో విద్యను అందిస్తామన్నారు.

ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారంగా ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల హావిూలో లేని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా రూ.1,00,116 అందజేసి కేసీఆర్‌ కుటుంబంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీలపై డ్రిప్పు ఇరిగేషన్‌తో పాటు పాలిహౌస్‌ను మంజూరు చేస్తున్నామని చెప్పారు. దీంతో పాటు రైతు కు రూ.ఐదు లక్షల బీమా సౌకర్యం అమలు చేస్తామన్నారు.