అన్నదాతలకు తప్పని పెట్టుబడి ప్రహసనం !
రైతులకు ఏటా పెట్టుబడి ఓ ప్రహసనంగా మారింది. బ్యాంకర్లతో విూటింగ్‌లు పెట్టి లక్ష్యం నిర్దేశించినా అంత సులువుగా రుణం దక్కడం లేదు. ఏటా బ్యాంకర్ల సమావేశంలో లక్ష్యాలు నిర్దేశిస్తున్నా ఆ లక్ష్యాలు చేరుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు రైతులను పురుగులుగానే చూస్తున్నారు. వారికి రుణాలు ఇవ్వడం అన్నది లక్ష్యంగా ఆలోచించడం లేదు. వానాకాల సీజన్ మొదలు కావడంతో అన్న దాతలు పంట రుణాల కోసం బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ఇదే పరిస్థితి ఉంది. అధికారుల ముందు తలూపడం తప్ప రుణాలు ఇవ్వడంలో పెద్దగా బ్యాంకర్లు స్పందిం చడం లేదు. ఇది ఏటా జరుగుతన్న తంతే. ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాలకు సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను ఎపి సిఎం జగన్ విడుదల చేశారు.ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో రుణ పంపిణీ లక్ష్యాలను ఎందుకు చేరుకోలేక పోయామనే విషయంపై బ్యాంకులు దృష్టిపెట్టాలని సూచించారు. సకాలంలో పెట్టుబడి అందించేలా నిర్దిష్ట విధానాలు అమలు కావడం లేదు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నపాలకులు క్షేత్రస్థాయిలో సమస్యలను పట్టించుకోవడం లేదు. ఎంత యంత్రాంగం ఉన్నా అంతా చేష్టలుడిగి చూస్తున్నారు. ఇకపోతే రుణాల చెల్లింపులపై రైతుల్లో అవగాహన లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ప్రభుత్వ విధి విధానాలు కూడా సక్రమంగా లేకపోవడంతో అన్నదాతల కు నష్టమే జరుగుతుంది. అసలు ఏప్రిల్, మే నెలల్లో నే ఖరీఫ్ రుణాలను అందజేస్తే రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతారు. తొలకరి వర్షాలు కురియగానే సాగు సందడి మొదలవుతుంది. ఇప్పటికే నీటి వసతి ఉన్న చోట్ల విత్తనాలను విత్తుతున్నారు. ఇప్పటి వరకు సరైనా వర్షాలు లేకపోవడంతో సాగు పనులు అంతంత మాత్రంగానే ముందుకు సాగుతు న్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. సకాలంలో బ్యాంకర్లు కొత్త రుణాలను చెల్లించక పోవడంతో రైతులకు వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు. ఎక్కువగా దళారులే రైతులకు రుణం అందిస్తున్నారు. కొన్నిచోట్ల 25శాతం వడ్డీ చొప్పున వసూలు చేస్తున్నారు. జిల్లాల్లో ఏటా కొన్ని కోట్ల రూపాయల వరకు దళారులు అక్రమ దందాకు ఎగబడుతున్నారు. కొత్త పంటరుణాల కోసం అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికే అప్పుసప్పు చేసి విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసిన రైతులు పంట రుణాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. రుణంరాగానే అప్పు తీరుస్తామంటూ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. కొందరు రైతులైతే ఆభరణాలను తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెడుతున్నారు. అప్పు చేసే స్థోమత లేని చిన్న సన్నాకారు రైతులు మాత్రం రుణం వచ్చేవరకు సాగు పనుల జోలికి వెళ్లడం లేదు. చేతిలో చిల్లిగవ్వ లేక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు. సకాలంలో రుణం చేతికి వస్తేనే సాగు పనులు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయనే లేదు. దీంతో పంట రుణాలు చెల్లించాలా వద్ద అనే సందిగ్ధత కనిపిస్తుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారి కాకపోయినా వచ్చే సీజన్ లోపైనా పంట రుణాలను మాఫీ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దశల వారీగా రుణమాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఏకకాలంలోనే లక్ష రూ పాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేయనే లేదు. అయితే లక్ష లోపు రుణం మాఫీ చేస్తే దాదాపుగా వేల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ ప్రకటనకు ముందే రుణం చెల్లిస్తే మాఫీ వర్తిస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రుణం చెల్లించేందుకు
అన్న దాతలు ఊగిలాడు తున్నారు. ఈసారి రుణ పక్రియ మరింత ఆలస్యం కావడంతో వానకాల పంటల సాగుపై ప్రభావం పడుతుంది. దీనికి తోడు పెట్టుబడి సహాయం కూడా ఆలస్యం కావడంతో రైతుల్లో అయోమయం కనిపిస్తుంది. విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేందుకు కొంతమంది రైతులు ప్రైవేట్ దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. రెన్యూవల్ కోసం బ్యాంకర్ల ఒత్తిళ్లు పంట రుణాల గడువు సమయం ముగిసి పోవడంతో సంబంధిత బ్యాంకర్లు అన్నదాతల పై ఒత్తిళ్లు చేస్తున్నారు. సకాలంలో పంట రుణాలను రెన్యూవల్ చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. కనీసం వడ్డీ చెల్లించైనా రుణ సొమ్మును రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశిస్తు న్నారు. కొన్ని బ్యాంకర్ల ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ రుణాలను చెల్లించాలని నేరుగా రైతుల ఇంటికి వెళ్తున్నారు. గ్రామాల్లో పలుకుబడి ఉన్న పెద్దలు, సర్పంచ్‌లతో రైతుల పై ఒత్తిళ్లు తెస్తున్నారు. రుణం తీసుకున్న రోజు నుంచి ఏడాది లోపు తక్కువ వడ్డీ వేస్తున్న ఆ తర్వాత గడువు మించితే అదనంగా వడ్డీ భారం పెరిగిపోతునే ఉంది. అయితే ప్రభుత్వం రుణమాఫీ చేసిన వడ్డీ సోమ్మును మాత్రం రైతులే చెల్లించాల్సి ఉంటుంది. యేటా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు రుణభారం మరింత పెరిగి పోతునే ఉంది. ఇదిగో అదిగో అంటూ ప్రభుత్వం కాలం గడపడంతో ఎన్నికలకు ముందు ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ధీమాతో రైతులు సక్రమంగా రుణం చెల్లించేందుకు ముందుకు రావడం లేదు.ముందు చూపు కరువు.. వానాకాల సీజన్ ప్రారంభమై వారంరోజులు గడుస్తున్నా రుణమాఫీ పై ప్రభుత్వానికి ముందుచూపు కరువైంది. పంటరుణాల కోసం బ్యాం క్‌లకు వెళ్తే రుణమాఫీపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో రుణాలను రెన్యూవల్ చేసేందుకు రైతులు వెనుకాడుతున్నారు. గతంలో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారు. ఈసారి మాత్రం నిబంధనలు ఎలా ఉంటాయోనని అన్నదాతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారో స్పష్టత నివ్వాలని రైతులు కోరుతున్నారు. గ్రామాల వారీగా అధికారులు పరిశీలనచేస్తే రైతుల సమస్యలు తెలుస్తాయి. వ్యవసాయాన్ని పండగ చేస్తున్నామన్న పాలకులు గ్రామాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుంటే మంచిది.