అన్నదాతలూ.. ఆత్మహత్యలొద్దు

3

– ప్రొ|| కోదండరామ్‌

నల్లగొండ జిల్లా, అక్టోబర్‌6(జనంసాక్షి):

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాజకీయ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ కోదండరాం అన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం లో బహుజన కమ్యూనిస్టు ఆధ్వర్యంలో ‘రైతుల ఆత్మహత్యలు, రైతాంగ సమస్యలు’ అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ కాలంకాక పంటలు నష్టపోయి, బోర్లు వేసి నీరు పడక వ్యవసాయం చేస్తే రైతు బతుకు ఆగమయ్యిందన్నారు. పంటకు ఎకరం సుమారు రూ.15 వేలు అప్పులు వడ్డీ వ్యాపారుల వద్ద తెచ్చి పెట్టుబడులు పెట్టారని, పంట చేతికి అందకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. కొద్దిపాటి పంట వేస్తే మద్దతు ధర రావడం లేదన్నారు.

అప్పులపాలైన రైతులు ఆత్మసైర్థ్యం కోల్పోకుండా ధైర్యంతో ఉండాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. రైతులు చస్తే ఆ కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి చిన్నాభిన్నం అవుతాయన్నారు. రైతులకు వున్న బ్యాంకు అప్పులను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు నష్టపరిహారం అందించాలని, గ్రామాల్లో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించాలని, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే దేశం, రాష్ట్ర బాగుపడుందన్నారు. మంచి విత్తనాలు అందించి భూపరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు పశువులు, గొర్రెలు, మేకల ద్వారా ఆదనపు ఆదాయం సంపాదించాలన్నారు. పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, పోరాడితేనే వ్యవసాయ రంగంలో మార్పు వస్తుందన్నారు. సమావేశంలో దళిత బహుజన కూలి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్వతాలు, జిల్లా కార్యదర్శి గాజుల శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు ధర్మార్జున్‌, టి.సత్యనారాయణ పాల్గొన్నారు.