అన్నపూర్ణమ్మ పాదయాత్రకు టి.జేఏసీ మద్దతు నిల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : ఆర్మూర్‌ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ నిర్వహించిన మూడురోజుల పాదయాత్రకు తెలంగాణ రాజకీయ జెఎసి మద్దతు ప్రకటించలేదని జిల్లా జెఎసి చైర్మన్‌ గోపాల్‌శర్మ స్పష్టం చేశారు. సోమవారం టిఎన్జీవోస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నపూర్ణ పాదయాత్రకు జెఎసి మద్దతు తెలిపిందని తప్పుడు ప్రకటనలతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందని వెంటనే ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. టిడిపి నాయకులు చంద్రబాబు నాయుడు తెలంగాణపై స్పష్టమైన వైఖరి కనబర్చకుండానే పాదయాత్రలు చేస్తున్నారని ఆయన బాటలోనే అన్నపూర్ణకూడా ప్రజలను వంచించడానికి పాదయాత్రను నిర్వహించారని ఆరోపించారు. ఆమె పాదయాత్రలో రౌడీలను వెంటబెట్టుకొని మాణిక్‌భండార్‌వద్ద జెఎసి నాయకులపై దాడులు నిర్వహించడం శోచనీయమని ఖండించారు. తెలంగాణ నగార సంస్థ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి చేపట్టిన బస్సుయాత్ర ఈనెల 26న జిల్లాలో కొనసాగుతుందని ఈ బస్సు యాత్రకు జెఎసి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని వెల్లడించారు. బస్సుయాత్ర కొనసాగే మండల, గ్రామాలలో విజయవంతం చేయాలని అక్కడి స్థానిక జెఎసి నాయకులకు సూచించామని పేర్కొన్నారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకే ఉద్యోగులకు నోటీసులు జారీ చేసిందని జెఎసి కన్వీనర్‌ వి.ప్రభాకర్‌ అన్నారు. విలేకరుల సమావేశంలో జెఎసి నాయకులు గైని గంగారాం, భాస్కర్‌ తదితరులున్నారు.