అన్నాడీఎంకేనుంచి శశికళ, దినకరన్‌

వెలిచెన్నై,సెప్టెంబర్‌ 12,(జనంసాక్షి): ఎత్తులు పై ఎత్తులతో ఇంతకాలం రసవత్తరంగా సాగిన తమిళ రాజకీయాల్లో కీలక మలుపు రజరిగింది. అనుకున్నట్లుగానే ఆ ఇద్దరిని పార్టీ నుంచి దూరం పెట్టారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళను అన్నాడీఎంకే నుంచి సాగనంపుతూ ఆ పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. జయలలిత స్థానంలో పార్టీ జనరల్‌ సెక్రటరీగా పీఠం దక్కించుకున్న శశికళను ఆ పదవి నుంచి దించేసింది. శశకళతో పాటు ఆమె జైలుకెళుతూ డిప్యూటీ చీఫ్‌గా నియమించిన దినకరన్‌ను సైతం పార్టీనుంచి బహిష్కరించారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నీ సర్వసభ్య సమావేశం రద్దు చేసింది. దీంతో శశికళ వర్గం అలియాస్‌ మన్నార్‌గుడి మాఫియాకి అన్నాడీఎంకే చెక్‌ పెట్టినట్టయింది. ఈ లక్ష్యంతోనే జయలలిత నమ్మినబంటుగా పేరున్న పన్నీర్‌సెల్వం ప్రస్తుత సీఎం పళనిస్వామితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. పళని స్వామి, పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో సమావేశమైన అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ మంగళవారం మొత్తం ఆరు కీలక తీర్మానాలను ఆమోదించింది. ఈ మేరకు అన్నాడిఎంకెలో దివంగత జయలలిత మాత్రమే శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ఉంటారని తీర్మానించారు. అలాగే పార్టీ గుర్తు రెండాకుల కోసం పోరాడాలని కూడా నిర్ణయించారు. మొత్తానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అమ్మజయలలిత మరణానంతరం పార్టీలో చక్రం తిప్పాలని భావించిన చిన్నమ్మ శశికళకు ఆరంభం నుంచే అడ్డంకులు ఎదురు కావడం, అవినీతి కేసుల్లో ఆమె జైలుకు వెళ్లడంతో ఇక ఆమె కన్న రాజకీయ కలలు సమాధి అయినట్లే. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన ఆమెను తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం తమిళనాడు మంత్రి ఉదయ్‌కుమార్‌ తీర్మానాన్ని చదివి వినిపించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పటికీ జయలలితదేనని తీర్మానించి.. ఆ బాధ్యతలను తాత్కాలికంగా చేపట్టిన శశికళను పదవి నుంచి తొలగిస్తూ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. పార్టీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పన్నీర్‌ సెల్వం, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి ఉంటారని కార్యవర్గం పేర్కొంది. ప్రధాన కార్యదర్శికి ఉండే అధికారాలన్నీ చీఫ్‌ కో ఆర్డినేటర్‌, అసిస్టెంట్‌ చీఫ్‌ కో ఆర్డినేటర్లకు ఉంటాయని సమావేశంలో తీర్మానించారు. జయలలిత నియమించిన ఆఫీస్‌ సిబ్బందిని అలాగే కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. శశికళ మేనల్లుడు దినకరన్‌ చేసిన ప్రకటనలు, ఆయన చేపట్టిన నియామకాలను పార్టీ ఆమోదించబోదని పేర్కొంది. ఇక రెండాకుల గుర్తు కూడా తమకే చెందుతుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ‘చిన్నమ్మ’ శశికళ పార్టీ పగ్గాలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అమ్మ మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీ రెండుగా చీలిపోయింది.ఈ క్రమంలో అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లారు. దీంతో ఆమె మేనల్లుడు దినకరన్‌కు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే పార్టీలోని పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు ఏకమయ్యాయి. అయితే శశికళ, ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి దూరంగా ఉంచాలన్న పన్నీర్‌ సెల్వం ప్రధాన డిమాండ్‌పై అంగీకారం కుదరడంతో ఈ విలీనం జరిగిన విషయం తెలిసిందే. దీంతో నేడు సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేసి.. శశికళను పదవి నుంచి తొలగించారు.