అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్‌ ఔట్‌

బహిష్కరణ వేటు వేసిన అధికార పార్టీ

చెన్నై,ఆగస్టు28 : తమిళనాట రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు దినకరన్‌ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు అధికార అన్నాడీఎంకే

సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి చిన్నమ్మ శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ పై బహిష్కరణ వేటు పడింది. ఈ మేరకు తమిళనాడులోని రొయపెట్టా వేదికగా సీఎం పళనిస్వామి నేతృత్వంలో సోమవారం ఆ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీరిని బహిష్కరిస్తూ అధికారిక నిర్ణయం తీసుకున్నారు. శశికళ చేపట్టిన నియామకాలన్నీ చెల్లుబాటు కావని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో పాటు అన్నాడీఎంకేకు చెందిన జయ టీవీ, నమదు ఎంజీఆర్‌ పత్రికను పార్టీ నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతం నమదు ఎంజీఆర్‌ పత్రిక జయ పబ్లికేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. దీనికి శశికళ యజమానిగా ఉన్నారు. జయ టీవీని మ్యాజిక్‌. కామ్‌ నిర్వహిస్తోంది. పార్టీ అధినేత్రి జయలలిత మరణం తర్వాత రెండు వర్గాలుగా చీలిపోయిన పార్టీ ఇటీవలే మళ్లీ కలిసిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ విలీనంపై దినకరన్‌ ఎదురుతిరిగారు. పార్టీ ఉపప్రధాన కార్యదర్శి ¬దాలో ముఖ్యమంత్రి పళనిస్వామి సహా పలువురు అన్నాడీఎంకే నేతలను తమ పదవుల నుంచి తప్పిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సమావేశమైన అన్నాడీఎంకే పార్టీ శశికళ, దినకరన్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే ఎంపీ ముతుకరప్పన్‌ విూడియాతో మాట్లాడుతూ శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచితొలగించామని చెప్పారు. ఇకపై పార్టీ తరఫున దినకరన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చెల్లదని తేల్చి చెప్పారు. పార్టీ నియమాల ప్రకారం దినకరన్‌ నియామకం జరగలేదని వెల్లడించారు. ఆయన నియామకాన్ని ఎన్నికల సంఘం కూడా ధ్రువీకరించలేదని తెలిపారు.

పళని సర్కారు పొంచి ఉన్న గండం

తమిళనాడులో పళని సర్కారుకు గండం పొంచి ఉంది. అన్నాడీఎంకే శాసనసభాపక్షం ఏర్పాటు చేసిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపిక కోసం సర్వసభ్య సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించారు. ఇంతటి కీలక సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే దినకరన్‌ తనకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పిన విషయం తెలిసిందే. అందులో 19 మంది ఇప్పటికే గవర్నర్‌ను కలిసి తమకు పళనిపై విశ్వాసం లేదని చెప్పారు. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. డీఎంకే కూడా సభలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు మెమొరాండం సమర్పించింది. తమ ఉద్దేశం ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదని, శశికళనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలని దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 19 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరి రిసార్ట్‌లోనే ఉన్నారు. సభలో బలపరీక్షకు గవర్నర్‌ ఆదేశించిన తర్వాతే వాళ్లంతా బయటకు రానున్నారు.