అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం
అందుకే కెసిఆర్ సిఎం కావాలి:షకీల్
కామారెడ్డి,సెప్టెంబర్27(జనంసాక్షి): అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యమని, గత అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని బోధన్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ షకీల్ అన్నారు.రైతులకు పెట్టుబడి సాయం, ఎకరాకు నాలుగువేల రూపాయలు అడగకుండానే అందించడంతో పాటు, ఉచిత బీమా సౌకర్యం కల్పించి రైతులకు సంక్షేమ ఫలాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుతం ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నా యన్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులకు ఊహించని విధంగా ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తోందని అన్నారు. గతంలో 15ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న పి.సుదర్శన్‌రెడ్డి చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందించే విషయంలో విఫలం అయ్యారని షకీల్ అన్నారు. గతంలో రెండు వందల రూపాయలు ఉన్న పింఛన్లను నేడు రూ.1,000, దివ్యాంగులకు రూ.1,500 అందించడంతో పాటు, ఆడపిల్లల తల్లిదండ్రులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో రూ.100116
అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతోందన్నారు. గొల్ల, కుర్మలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఉచితంగా గొర్రెలు అందించామన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, ప్రసవం అనంతరం రూ.12వేలు, కేసీఆర్ కిట్లు అందిస్తున్నామన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా బోధన్ నుంచి ఎన్నికైనప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. తనను మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించి సిఎంగా కెసిఆర్ కొనసాగేలా ఆశీర్వదించాలన్నారు. అప్పుడే అభివృద్దిలో దూసుకుపోతామని అన్నారు.