అన్ని అంశాలపై చర్చకు సిద్దంగా ఉన్నాం
ప్రభుత్వమే ముందుకు రాకుండా చేస్తోంది
ప్రధాన అంశాలపైనా చర్చకు తావులేకుండా పోతోంది
విపక్ష కాంగ్రెస్ ఎంపి అధీర్ రంజన్ ఆవేదన
న్యూఢల్లీి,డిసెంబర్21( జనం సాక్షి): పార్లమెంటును నడపటం ప్రభుత్వం బాధ్యతని,ప్రజల సమస్యలపై చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలని లోక్‌సభలో విపక్షనేత అధీర్ రంజన్ అన్నారు. ఏ అంశమైనా చర్చిస్తామని చెప్పి కేవలం బుల్‌డోజ్ వ్యవహారంతో ప్రభుత్వం ముందుకు పోతోందని అన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే తాము లేవనెత్తిన ప్రజాహిత అంశాలపై చర్చ జరపాలని సవాల్ విసిరారు. పెరుగుతున్న ధరలు, లఖింపూర్ ఖీరీలపై చర్చ జరగాల్సిందేనన్నారు. సాగుచట్టాల రద్దు సందర్భంలోనూ చర్చలకు అవకాశం లేకుండా చేశారని అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం లేకుండా పోతోందన్నారు. ఇకపోతే లఖింపూర్ ఘటనలో కేంద్రమంత్రిని బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. విపక్షాలకు సభ సజావుగా జరగడం ఇష్టం లేదని మంత్రులు ప్రకటించేకన్నా..చర్చలకు అవకాశం ఇవ్వడం లేదన్న విషయం తెలుసుకోవాలని ఆయన విమర్శలు గుప్పించారు. ఇకపోతే ఓటరు ఆధార్ అనుసంధానంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని అన్నారు.
ఆధార్‌తో అనుసంధానం చేయాలంటే ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని, దీనివల్ల ఓటర్ల వ్యక్తిగత గోప్యత దెబ్బ తింటుందని అన్నారు. తమ జాబితాను దుర్వినియోగం కాకుండా చూసుకుంటామని గతంలో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆధార్‌తో అనుసంధానం స్వచ్చందమని కేంద్ర న్యాయ మంత్రి చెప్పినప్పటికీ ఆచరణలో అది సాధ్యం కాదన్నారు. బిల్లును కనీసం రాజ్యసభలోనైనా స్థాయూ సంఘానికి నివేదించాలని సూచించారు.
ప్రస్తుతం ఏడాదికి ఒకసారే ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. ఏటా జనవరి1 తేదీ నాటికి 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. డిసెంబరులో ఎన్నికలు జరిగే జనవరి1 నుంచి డిసెంబరు వరకు మధ్యకాలంలో 18 ఏళ్లు నిండిన వాళ్లకు అవకాశం ఇవ్వకపోవడంతో లక్షల సంఖ్యలో యువత తాజా ఎన్నికల్లో ఓటువేసే అవకాశం కోల్పోతారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త ఓటర్లను చేర్చేందుకు నాలుగు అర్హత తేదీలను ప్రకటించారు. జనవరి1, ఏప్రిల్1, జూన్1, అక్టోబరు1ను కటాఫ్ తేదీలుగా ప్రకటించారు. జాబితా నాలుగుసార్లు అప్‌డేట్ అవుతుంది.