అన్ని ప్రాంతాల అభివృద్ధికే మూడు రాజధానులు

అమరావతి పేరుతో టిడిపి భూ వ్యాపారం: ఎమ్మెల్యే
అనంతపురం,ఫిబ్రవరి24(జనం సాక్షి): రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్ధేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేసి, పాలనా వికేంద్రీకరణ చేస్తున్నారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అమరావతి ముసుగులో టిడిపి నాయకులు ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భూములు కొనుగోలు చేశారని చెప్పారు. వారి స్వలాభం కోసం అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల అభివద్ధి చెందుతాయన్నారు.
సంక్షేమానికి జగన్‌ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. మైనార్టీలతో పాటు బిసి,ఎస్సి,ఎస్టీలకు నామినేటెడ్‌ పనుల్లో, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కేటాయించారని గుర్తు చేశారు. జిల్లాలో వ్యవసాయం ఎక్కువని ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకు దృడసంకల్పంగా ముందుకెళుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సి అమలు చేయమని ప్రకటించారని ఈ విషయంలో ఆందోళన చెందొద్దని ముస్లిం, మైనార్టీలకు అభయమిచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించేలా సీఎం జగన్‌ కృషి చేస్తారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం రూ.4వేల కోట్లు ధరలస్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారన్నారు. వ్యవసాయం, విద్యకు సీఎం జగన్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మార్కెట్‌యార్డులను బలోపేతం చేస్తానని హావిూ ఇచ్చారన్నారు. అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, రైతులు, వ్యాపారుల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పథంలోకి తీసుకెళతా మన్నారు.