అన్ని రాష్ట్రాల్లో..  ఐటీ దాడులు జరుగుతున్నాయి

– టీడీపీ నేతలు రాజకీయ రాద్ధాంతం చేయొద్దు
– రాజకీయ ఆరోపణలతో తప్పించుకోవాలని చూస్తున్నారు
– రమేష్‌ సత్యహరిశ్చంద్రుడులా మాట్లాడుతున్నారు
– తమకు తాము క్లీన్‌చిట్‌ ఇచ్చుకుంటే సరిపోదు
– అధికారులు తేల్చాలని గుర్తుంచుకో
– విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు
న్యూఢిల్లీ, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయని, కానీ కేవలం ఏపీలోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని, కక్షపూరితంగా చేయిస్తున్నారంటూ రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు విమర్శించారు. సోమవారం ఆయన ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఐటీ అధికారులు సోదాలు జరపడంతో టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ సత్యహరిశ్చంద్రుడులా మాట్లాడుతున్నారని అన్నారు. ఒక్క ఏపీలోనే కాదు.. అన్ని రాష్టాల్లో ఐటీ సోదాలు జరిగాయని అన్నారు. దేశంలో 2016-17లో 1152 ఐటీదాడులు, 2017-18లో 600 సోదాలు జరిగాయని గుర్తుచేశారు. టీడీపీ నేతలు ప్రగల్బాలు పలకకుండా ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జీవీఎల్‌ అన్నారు. టీడీపీ నేతలు రాజకీయ ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఐటీ సోదాలను రాజకీయం చేయొద్దని సూచించారు. టీడీపీ తనకు తానుగా క్లీన్‌చిట్‌ ఇచ్చుకుంటే సరిపోదని, అధికారులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముందస్తు సమాచారంతో అంతా సర్దుకున్నామని సీఎం రమేష్‌ అంటున్నారని జీవీఎల్‌ ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ రాజకీయాలను మార్కెట్‌ చేసిందని ఆరోపించారు. టీడీపీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని జీవీఎల్‌ విమర్శించారు. కేంద్రం ఎవరిపైన కక్ష సాధింపు చర్యలకు దిగదని తెలిపారు.  దక్షిణ భారత ప్రజలను సిద్ధూ అవమానించడం తగదన్నారు. దక్షిణ భారతం కంటే పాకిస్థాన్‌ తనకు ఇష్టం అని సిద్దు చెప్పడంలో అర్థమేంటని ప్రశ్నించారు. గతంలోనూ కాంగ్రెస్‌ పార్టీ దక్షిణ భారతీయులని అవమానించిందని విమర్శించారు. సిద్ధూ వ్యాఖ్యాలపై రాహుల్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. పీవీ నరసింహారావు అంత్యక్రియలను ఢిల్లీలో నిర్వహించాలని మన్మోహన్‌ సింగ్‌ భావించినా, సోనియాగాంధీ అనుమతించలేదని జీవీఎల్‌ ఆరోపించారు.