అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం
– జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
– సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సెర్ప్ ఉద్యోగులు
జనంసాక్షి , మంథని : అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ఐకేపీ ఉద్యోగులకు జీఓ నం 11 ద్వారా పే స్కేల్ అమలు చేస్తూ జీఓ ఇచ్చిన సందర్బంగా గురువారం మంథని పట్టణంలోని రాజగృహాలో పెద్దపల్లి జిల్లా ఐకేపీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అనేక విధాలుగా మేలు జరుగుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు గుర్తింపు ఇచ్చారని, ప్రభుత్వ ఉద్యోగులు గౌరవంగా బతుకాలన్న సంకల్పంతో అనేక జీఓలను అమలు చేశారన్నారు. అనేక ఏండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థికాభివృద్దికి సహకారం అందించే ఐకేపీ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేయడం సీఎం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనమన్నారు. అనంతరం ఐకేపీ ఉద్యోగులు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌ను శాలువాతో సన్మానించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.