అన్యాయాన్ని ప్రశ్నించిన కాళోజీ

– ఘనంగా జయంతి వేడుకలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): కవి కాళోజీ నారాయణరావుతో కలసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం గొప్ప అనుభూతి అని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తదితరులు అన్నారు. ఆయన కవిత్వం ఉరకలెత్తించేదని అన్నారు. కాళోజీ 103వ జయంతి వేడుకలో రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కవి రావులపాటి సీతారాంకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ వేడుకల సందర్భంగా సీతారాంకు అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. పురస్కారంతో పాటు రూ. 1,01,116ల నగదును సీతారాంకు అందజేశారు. గతేడాది ప్రముఖ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్నకు, 2015 ఏడాదికి గానూ సుప్రసిద్ధ రచయిత అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ కేంద్రమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, నందిని సిధారెడ్డి, , టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తో పాటు పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం హర్షణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ప్రజల సమస్యలను తన గొడవగా కవి కాళోజీ ప్రకటించుకున్నారని గుర్తు చేసుకున్నారు. కాళోజీ మాటలను సీఎం కేసీఆర్‌ తూచా తప్పకుండా చేసి చూపించారని తెలిపారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ 103వ జయంతిని రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించారు. పీడన, అణిచివేత, దుర్మార్గం, దౌర్జన్యం, దోపిడీ తొలగిపోయి మనిషిగా జీవించాలని ప్రతి ఒక్కరికీ చెప్పిన కవి కాళోజీ అని కాళోజీ అవార్డు గ్రహీత సీతారాం పేర్కొన్నారు. అంతటి గొప్ప కవి పేరుతో అవార్డుకు తనను ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌ కు ధన్యవాదాలు చెప్పారు.