అప్పుకోసం భార్యనే బలిపెట్టాడు

 

ఢిల్లీ మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో జరిగిన సంచలన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. వాయవ్య ఢిల్లీలోని రోహినీ ప్రాంతంలో బుధవారం హత్యకు గురైన మహిళ

కేసులో ఆమె భర్తను అరెస్టు చేశారు. భర్తే ఆమెను హత్య చేసి ఎవరో హత్య చేశారనే కట్టుకథను సృష్టించాడని పోలీసులు కనిపెట్టారు. 34 ఏళ్ల ప్రియా మెహ్రాను ఆమె భర్త పంకజ్‌ మెహ్రా హత్య చేసినట్టు పోలీసులు నిర్దారించారు. ఉద్దేశపూరితంగా భార్యను చంపి.. అది తనకు అప్పు ఇచ్చిన వ్యక్తి విూద నెట్టేందుకు బూటకపు దాడి జరిగినట్టు నమ్మించేందుకు పంకజ్‌ ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ప్రియా మెహ్రా వాహనంలో ఉండగానే ఆమెను పంకజ్‌ కాల్చిచంపాడు. ఆ సమయంలో వారి రెండేళ్ల కొడుకు ప్రియా ఒడిలో ఉన్నాడు. ఆ చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. ముగ్గురు-నలుగురు వ్యక్తులు కారులో వచ్చి తమ వాహనాన్ని అడ్డుకున్నారని, ఆ తర్వాత తన భార్యను కాల్చిచంపి పరారయ్యారని బూటకపు కథనాన్ని పంకజ్‌ పోలీసులకు చెప్పాడు. అయితే, సంఘటనాస్థలంలో రెండో వాహనం లేకపోవడం.. అతడు చెప్పిన ఆనవాళ్లు ఏవిూ దొరక్కపోవడంతో పోలీసులు అతడు చెప్పేది అనుమానించారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో పంకజ్‌ నిజాన్ని ఒప్పుకున్నాడని, వ్యాపారంలో నష్టాలు రావడంతో రూ. 40 లక్షల వరకు అతను అప్పులు చేశాడని పోలీసులు తెలిపారు. పంకజ్‌కు మరో మహిళతో వివాహం అయిందని, ప్రియాతో అతను కలిసి ఉండటం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. 11 ఏళ్ల కిందట ప్రియా-పంకజ్‌కు పెళ్లయిందని, ఇటీవల తమకు పుట్టిన కొడుకు కారణంగా ఇద్దరూ మళ్లీ కలిసి ఉంటున్నారని ఆ వర్గాలు వివరించాయి. భార్య హత్యను అప్పు ఇచ్చిన వ్యక్తి విూద తోసేస్తే.. రూ. 40 లక్షలు తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదని అతడు భావించినట్టు తెలిపాయి. ప్రియకే ఎక్కువ బుల్లెట్లు తగలడం.. పంకజ్‌కు స్వల్ప గాయాలు కావడంతో అతనిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా రాత్రికి రాత్రే నిజాలన్నీ బయటపడ్డాయి. దీనికితోడు పంకజ్‌ అప్పు చెల్లించకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వ్యక్తి కొంతకాలంగా పంకజ్‌ను బెదిరిస్తున్నాడు. ఎలాగైనా అతని నుంచి తప్పించుకోవాలని ప్లానేసిన పంకజ్‌ తన భార్య ప్రాణాలు పణంగా పెట్టాలనుకున్నాడు. కొందరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి భార్యను చంపిచేస్తే అది చేయించింది తనకు అప్పు ఇచ్చిన వ్యక్తేనని నమ్మించి కేసు పెట్టచ్చని ప్లాన్‌ వేసినట్లు పంకజ్‌ పోలీసులకు తెలిపాడు.