అప్పుల సాగుతో కుదేలయిన అన్నదాతలు
వడ్డీలు పెరగడంతో అధిక రుణభారం
మళ్లీ పంటలు వేయడమెలా అన్నదే సమస్య
ప్రభుత్వ సాయం కోసం రైతాంగం ఎదురుచూపు
నిజామాబాద్,జూలై20(జనంసాక్షి): అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులన్ని వరదనీటిలో కొట్టుకుపోయాయని ఇప్పటికే తాము బ్యాంకు రుణాలు అందక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి పంటలు సాగుచేశామని జిల్లా రైతులు వాపోతున్నారు. రైతుబంధు కూడా ఆలస్యం గా పంపిణీ కావడం తమకు అవరోధమైందంటున్నారు. గత రెండు, మూడు సంవత్సరాల నుంచి నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం భిన్నంగా నష్టం జరిగిందని, ప్రభుత్వం తమను వెంటనే ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రైతాంగం కోరుతోంది. వర్షాలవల్ల నష్టపోయిన పంటలస్థానంలో మళ్లీకొత్తగా ఆ పంటలను సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరదంటున్నారు. ప్రభుత్వం తమ నివేదికల ఆధారంగా విత్తనాలు పంపిణీ చేస్తే వాటిని రైతులకు అందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పశువులు, మేకలు చనిపోయి నష్టపోయిన వారికి, ఇళ్లు కూలిపోయిన వారికి కూడా పరిహారాన్ని ప్రకటించాలన్న డిమాండ్ వస్తోంది. దీంతో పాటు చెరువులు, రోడ్ల మరమతులకు సైతం ప్రత్యేక నిధులు కేటాయించాలంటున్నారు. జిల్లాలో జరిగిన నష్టం అంచనాలు దాదాపు రూ. 20 కోట్లకు పైగా ఉన్నందున ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు. ఖరీఫ్‌సీజన్‌కు సంబంధించి పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, కందుల పంటలు పెద్దఎత్తున దెబ్బతినడంతో ఇక మళ్లీ అవే పంటలను సాగుచేయడం రైతులకు సవాలుగా మారనుంది. పంటలసాగు ఆలస్యం కానున్నందున దిగుబడుల సమయం మరింత దూరమవుతుందని చెబుతున్నారు. దీంతో రబీసీజన్‌కు ఆటంకాలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఈ నష్టం కారణంగా దాదాపు 10 వేల మంది అన్నదాతలు కొలుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. వ్యవసాయాధికారులు యుద్ధ ప్రాతిపాదికన రూపొందించిన ప్రాథమిక పంటలనష్టం అంచ నాలను సర్కారుకు నివేదించారు. అలాగే కడెం ప్రాజెక్టు కారణంగా వరితో పాటు మొక్కజొన్న, పసు పు పంటలు గల్లంతయ్యాయి. పంటలు కొట్టుకుపోవడమే కాకుండా పంట చేనులో పెద్దఎత్తున ఇసుకమేటలు వేయడంతో రైతులు మళ్లీ సాగుపనులు ఎప్పుడు మొదలవుతాయోనన్న ఆందోళనకు గురవుతున్నారు. నష్టపోయిన పంటలకు, ఆస్థులకు పరిహారం అందించాలన్న డిమాండ్ సర్వత్రా నెలకొంటోంది. ఇదిలావుంటే ప్రకృతి వైఫరీత్యాల కారణంగా జరిగిన నష్టాలకు కేందప్రభుత్వమే పరిహారం అందించాల్సి ఉంటుందని అధికార టిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.