అఫ్ఘాన్‌లో మరోమారు తాలిబన్ల విధ్వంసం
నగరాలను గుప్పిట పెట్టుకునే యత్నం
ఘజ్నీ స్వాధీనానికి పోరాటం
కాబుల్,ఆగస్ట్15(జనం సాక్షి): అఫ్ఘనిస్తాన్ మరోమారు తాలిబన్ల గుప్పిట్లోకి పోనుందా అంటే తాజా ఘటనలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో మారోమారు తాలిబన్లు సృష్టిస్తున్న విధ్వంసం కారణంగా ప్రభుత్వం పట్టుకోల్పోంతోంది. గతంలో రష్యా సాయంతో అక్కడ ఏర్పడ్డ నజీబుల్లా ప్రభుత్వాన్ని కూల్చివేసిన తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు. ఆ తరవాత అమెరికా తాలిబన్లపై దాడులకు తెగించడంతో మళ్లీ వారు తోకముడిచారు. అయితే రష్యా సంకీర్ణ సేనలు ఉపసంహరించుకున్న తరవాత అక్కడ ఇప్పుడు నరమేధం నిత్యం సాగుతోంది. రోజూ దాడులు లేకుండా జీవితం గడపడం గగనంగా మారింది. ఈ దశలో వారు దాడులకు తెగిస్తూ నగరాలను ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉన్నారు.రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న తూర్పు ఘజని నుంచి తాలిబన్లను తరిమికొట్టాలని ప్రయత్నిస్తున్న అఫ్గాన్ భద్రతాదళాలకు మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పర్యబ్ ప్రావిన్స్‌లోని ఘోర్‌మాచ్ జిల్లాలో ఉన్న కీలక సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించారు. అక్కడ కాపలా ఉన్న సైనికుల్లో 17 మంది పొట్టనపెట్టుకున్నారు. 40 మందిని బందీలుగా పట్టుకున్నారు. మరో 40 మంది తాలిబన్ల ధాటికి తట్టుకోలేక సవిూప కొండల్లోకి పారిపోయారు. ఆదివారం నుంచి ఈ సైనిక స్థావరంపై తాలిబన్లు దాడులు మొదలుపెట్టారు. తిరుగుబాటుదారుల దాడులను ఎక్కువకాలం ఆపడం కష్టమని, మరిన్ని బలగాలతో పాటు వైమానికసాయం కావాలని అక్కడి స్థావరంలోని సైనికులు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా సానుకూల స్పందన రాలేదని పర్యబ్ ప్రావిన్స్ మండలి అధ్యక్షుడు తాహిర్ రెహ్మాని వాపోయారు. ఘజని నగరంపై పట్టు నిలుపుకోవడానికే ప్రభుత్వబలగాలు ఆపసోపాలు పడుతున్నాయన్నారు. కాబుల్-కాంధహార్ జాతీయ రహదారిపై రాజధాని నుంచి 220 కివిూ దూరంలో ఉన్న ఘజనీపై పట్టు సాధించడానికి సైతం తాలిబన్లు వారంరోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలోకి ప్రవేశించిన తాలిబన్లు ప్రభుత్వ అధికారులు, వారి బంధువుల కోసం ఇంటింటా వెతుకుతున్నారు. కనిపించినవారిని కనిపించినట్లు చంపేస్తున్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న భద్రతాదళాలను ఎత్తయిన భవనాల పైనుంచి మాటువేసి మరీ కాలుస్తున్నారు. వారంరోజులుగా జరుగుతున్న ఈ నరమేథంలో ఇప్పటికే 110 నుంచి 150 మంది పౌరులు చనిపోయినట్లు సమాచారం అందిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు ట్రక్కుల నిండా ఉన్న పౌరుల శవపేటికలను శ్మశానవాటికకు తీసుకెళ్లడం చూశానని ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు. పౌరులు నగరాన్ని వీడిపోకుండా ప్రధానమైన ఉత్తర, దక్షిణ రహదారుల్లో లాండ్‌మైన్లు పాతారని తెలిపాడు. నగరంలో అనేకచోట్ల పొగ ఎగసిపడుతోందని, దుకాణాలను లూటీ చేశారని, తాగునీరు-ఆహారం దొరకడం లేదని వాపోయాడు. తాలిబన్ల దాడిలో ఒక్క సోమవారమే వంద మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, 20-30 మంది పౌరులూ చనిపోయారని అఫ్గాన్ రక్షణమంత్రి వెల్లడించారు. మొల్తంగా మరోమారు దాడులతో వారు తెగిస్తున్నారు. ఇటు పాక్, అటు ఐఎస్ సాయం తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో అఫ్ఘాన్ మరోమారు తాలిబన్ల గుప్పిట్లోకి వెళుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి.