అఫ్ఘాన్ పార్లమెంట్‌పై ఆత్మాహుతి దాడి
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. వరుసగా తొమ్మిది భారీ పేలుళ్లు సంభవించినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో లోపల ఉన్న ప్రజాప్రతినిధులందరూ బయటకు పరుగులు తీశారు. బయటకు వచ్చిన వారిపై సమీప భవనాలలో ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం. పలువురు ప్రజాప్రతినిధులు గాయపడగా.. చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో తేరుకున్న భద్రతా దళాలు పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టి ఎదురుకాల్పులు జరిపారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ దాడిలో మొత్తం 20 మంది ఉగ్రవాదులు పాల్గొనట్టు తెలుస్తోంది. కాగా, ఈ దాడులకు బాధ్యత వహిస్తూ తాలిబన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.