అబద్దాలపై నడుస్తున్న వైసిపి ప్రభుత్వం
మూడేళ్లలో ఏ హావిూని సక్రమంగా నెరవేర్చని జగన్
మండిపడ్డ జనసేనాని పవన్ కళ్యాణ్
అమరావతి,జూలై8( జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అబద్దాల ప్రచారంపై నడుస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ ప్లీనరీ నిర్వహణపై ఆయన ఘాటుగా స్పందించారు. గడిచిన మూడేండ్ల పాలనలో రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. ఏపీలో 64 లక్షల మందికి రైతుభరోసా ఇస్తున్నామని ప్రకటించి 50 లక్షల మందికే రైతు భరోసా ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మూడేళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోగా 700 మందికే ఆర్థిక సాయం అందించింది నిజం కాదా అని నిలదీశారు. ప్రభుత్వం వద్ద నిధులు లేక ఫీజ్ రియంబర్స్ చేయక విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు ఆపేస్తుందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నుంచి ఆస్పత్రులు ఎందుకు పక్కకు తప్పుకుంటున్నాయని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని ప్రభుత్వమని విమర్శించారు. మద్యంపై ఆదాయం చూపించి రూ. 8 వేల కోట్లు బ్రాండు అమ్మలేదా ? 2021`22లో రూ. 22 వేల కోట్లు సంపాదించడం ఇదేనా మద్య నిషేధమని ప్రశ్నించారు. అమ్మ ఒడిని 43 లక్షల మందికే ఇచ్చి 83 లక్షల మందికి ఇచ్చినట్లు అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో 5లక్షల పింఛన్లు తొలగించిన మాట వాస్తవం కాదా సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.