అబద్దాలు చెప్పేందుకే వచ్చారు

 

బిజెపి అధికారంలోకి రావడం కల్ల

ఢిల్లీ బిజెపి నేతలపై కర్నె మండిపాటు

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణకు వచ్చి బిజెపి నేతలు, కేంద్రమంత్రులు పచ్చి అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తప్పుపట్టారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం నిరంతర పక్రియ అని, ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. తాము బీజేపీతో లేము కనుకే తెలంగాణ పట్ల నిర్లక్ష వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా ఇచ్చి, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుని విస్మరించారని మండిపడ్డారు. బీజేపీ నేతలు తెలంగాణలో లేనట్టు ఏపీ నుంచి అరువు తెచ్చుకుని టీఆర్‌ఎస్‌ పై మాట్లాడిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే చారిటీ కాదని మాట్లాడిన రాంమాధవ్‌ కూడా టీఆర్‌ఎస్‌ పై విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు. కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టు బీజేపీ నేతల తీరు ఉందని ప్రభాకర్‌ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తాను ముఖ్యమంత్రి అవుతానంటూ స్వామి పరిపూర్ణానంద పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు.

బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. సీఎం కేసీఆర్‌ పై విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్న బీజేపీ నేతల తీరును ఖండించారు. నాలుగు ఓట్ల కోసం బీజేపీ నేతలు నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంతో వివిధ అంశాలపై పార్లమెంటులో, బయట పోరాడినప్పటికీ బీజేపీ తెలంగాణకు ఏం చేయలేదన్నారు.

తెలంగాణలో ఆయుష్మాన్భవ పథకం ఎందుకు అమలు చేయడం లేదని మాటిమాటికీ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, దానికన్నా మంచి పథకం ఆరోగ్య శ్రీ బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్సీ ప్రభాకర్‌ వివరించారు. మనిషి పుట్టినప్పట్నుంచి చనిపోయే వరకు అందరికి వర్తించే పథకాలు తెలంగాణలో

అమలు చేస్తున్నామని, తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలు కేంద్రంలో ఎందుకు లేవో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పరిపూర్ణానంద తనకు తాను యోగి ఆదిత్యనాథ్‌ లా ఊహించుకుంటున్నారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రిని అవుతానని పగటి కలలు కంటున్నారని కర్నె ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. పరిపూర్ణ ప్రవచనాలు చెప్పుకోవచ్చు కానీ అబద్దాలు చెప్పకూడదన్నారు. ప్రవచనాలు చెప్పేందుకు పరిపూర్ణానంద డబ్బులు తీసుకుంటారేమో, అందుకే ప్రజలు డబ్బులు తీసుకుని సభలకు వస్తారని హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత ఇలాంటి అబద్దాల స్వామి దగ్గరికా తాము పోయింది అని పరిపూర్ణ భక్తులు వాపోయే పరిస్థితి వస్తుందన్నారు. తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతమని, పరిపూర్ణానంద రాజకీయాలు ఇక్కడ నడవవని స్పష్టం చేశారు. దిగుమతి చేసుకున్న బీజేపీ నేతలు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని తేల్చిచెప్పారు. ఎన్నికలప్పుడే బీజేపీకి రామమందిరం గుర్తుకు వస్తుందని, మత రాజకీయాలతో బీజేపీకి తెలంగాణలో ఓట్లు పడవన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో అన్నీ అబద్దాలే ప్రచారం చేస్తోందని కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు సిఫారసు చేసిన వారితో పాటు ఎందరో పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందిందని చెప్పారు. స్వాహా చేసే అలవాటు కాంగ్రెస్‌ నేతలకే ఉందని, అందుకే స్కామ్‌ గ్రెస్‌ గా మారిందని విమర్శించారు. మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చవాన్‌ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన స్క్రిప్టును చదివారని, చవాన్‌ వాస్తవాలు తెలుసుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించరని అన్నారు.