అభివృద్దికి చిరునామా తెలంగాణ
కెసిఆర్‌ను మించిన నేత లేడు: రామలింగారెడ్డి
సిద్దిపేట,నవబంర్28(జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని దుబ్బాక టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. చెరకు ముత్యం రెడ్డి లాంటి వారు కెసిఆర్ పథకాలను మెచ్చకుని టిఆర్‌ఎస్‌కు మద్దతు పలికారని అన్నారు. నాలుగున్నర ఏళ్లలో ప్రజలే బలం అభివృద్ధే ధ్యేయంగా పని చేశామని అన్నారు. ఎమ్మెల్యేగా వందల కోట్ల నిధులు తీసుకవచ్చి అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు.ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. అన్ని గ్రామాల్లో రాబోయే రోజుల్లో ప్రతి పొలానికి పంట నీరు అందించేందుకు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హావిూ ఇచ్చారు. చంద్రబాబును బుజాల విూద ఎత్తుకొని తీసుకొస్తున్న కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. అలాంటి వారిని చిత్తుగా ఓడించి రాజకీయంగా తరిమికొట్టాలన్నారు. కాంగ్రెస్,టీడీపీ హయాంలో ప్రజలు కరెంటుకష్టాలు అనుభవించారని తెలంగాణ ప్రభుత్వం 24గంటలు కరెంటు ఇస్తూ వారి కష్టాలు కడతేర్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆదరించి మళ్లీ అధికారంలోకి తీసుకవస్తే, వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు రూ.2016 పింఛన్, వికలాంగులకు రూ.3016 ఇస్తామని, పంటపెట్టుబడి సాయం కింద ఎకరానికి ప్రతి సంవత్సరం రూ.10వేలు ఇస్తామని అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఆదరించి మరోసారి ఆశీర్వదిస్తే ప్రజల కష్టాలు పూర్తిగా తొలిగిపోతాయన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే కారుగుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.