అభివృద్దిని వివరించేందుకే ప్రగతి నివేదన

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించదని ఎమ్మెల్యే రేఖానాయక్‌ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కనుమరుగైన కుల వృత్తులకు పూర్వవైభవం తీసుక వచ్చేందకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు. గొల్ల, కుర్మలకు సబ్సిడీపై గొర్రెలు, ఇతర కుల వృత్తులకు సైతం సబ్సిడీ రుణాలను అందజేస్తున్నారన్నారు. ఈ పథకాల గురించి ప్రజలకు వివరించడానికి హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌లోని కొంగర కలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభకు జిల్లా నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వ హయంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయన్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, ఉచిత నిరంతర విద్యుత్‌, రుణమాఫి, రైతు బందు లాంటి పథకాలను రాష్ట్ర సర్కారు అమలు చేస్తోందన్నారు. స్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 522 గురుకులాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కో విద్యార్థి కోసం ప్రభుత్వం రూ.లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. గురుకులాల్లో దుస్తులు, బూట్లు, స్టేషనరీకి సంబంధించిన అన్ని వసతులు అందిస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం కోడికూర, ప్రతి రోజూ కోడిగుడ్లు అందిస్తున్నారని చెప్పారు. బడిబయట పిల్లలు ఉండకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారన్నారు. పేద విద్యార్థుల చదువుకున్న రోజు, పేదలు కడుపునిండా తిన్నరోజే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో రేషన్‌ బియ్యం ఒక్కరికి 4కిలోల చొప్పున సీలింగ్‌ పెట్టి కేవలం 20 కిలోలే ఇచ్చేవారని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీలింగ్‌ లేకుండా రూపాయికే ఒక్కరికి ఆరు కిలోల చొప్పున అందిస్తున్నదన్నారు. గర్భవతికి మూడు నెలల నుంచి అంగన్‌వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకుంటే ఒకపూట సంపూర్ణ భోజనం, రోజూ గుడ్డు, పాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవించి బాబు పుడితే అమ్మ ఒడి పథకంతో రూ.12వేలు, పాప పుడితే రూ.13వేలతో పాటు కేసీఆర్‌ కిట్‌ఇస్తున్నామన్నారు.