అభివృద్ది కార్యక్రమాలతో విపక్షాల్లో వణుకు: ఈగ
నిజామాబాద్,ఆగస్ట్3(జనం సాక్షి): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులకు వెన్నులో వణుకు పుడుతుందని తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక కాలేశ్వరం, మల్లన్నసాగర్ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సన్నబియ్యం, షాదీముబారక్, దివ్యాంగులకు పింఛన్ల పెంపు, ఒక్కరికి ఆరుకిలోల బియ్యం.. ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ సీఎం మొదటి స్థానంలో నిలిచారన్నారు. తెలంగాణాను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చేసి యువకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఉద్యమాల చేపట్టి తెచ్చుకున్న తెలంగాణను బంగారుమయం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇదిలావుంటే నిజాంసాగర్ ఆయకట్టు కింద వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పోలాలకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి వెంటనే స్పందించి ఎండుతున్న పంటల రక్షణకై సింగూరు నీటిని విడుదల చేయాల్సి ఉందని అన్నారు. అయితే నీరు లేకపోవడంతో ఇంతకాలం ఆసల్యం జరుగుతోంది. నిజాంసాగర్ ఆయకట్టు రక్షణకై నిర్మించిన సింగూరు ప్రాజెక్టులో సరిపడా నీళ్ళు ఉన్నందున వెంటనే 8 టీఎంసీల నీటిని విడుదల చేసి సాగర్ ఆయకట్టు కింద వేసుకున్న పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాలతో రైతులు ఎంతో ఉత్సాహంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పంటలు వేసుకున్నారు.కానీ ఇప్పటికీ నీటిని వదలకపోవడం శోచనీయమన్నారు. అయితే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఈగ గంగారెడ్డి అన్నారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వెళతామని అన్నారు.