అభివృద్ది కోసం మరోమారు ఆశీర్వదించండి
విూ కోసం పనిచేస్తున్నందుకు ఆదరించండి
ప్రచారంలో మంత్రి చందూలాల్
ములుగు,నవంబర్27(జనంసాక్షి): నియోజకవర్గ అభివృద్ది బాధ్యత తనదని, మరోమారు తనను గెలిపింస్తే మరింత అభివృద్ది చూపి,రుణం తీర్చుకుంటానని మంత్రి, ములుగు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆజ్మీరా చందూలాల్ అన్నారు. నాప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవకే అంకితం చేస్తానన్నారు. తాను రైతుబిడ్డనని, అందువల్ల రైతులు నష్టపోకుండా చూసే బాధ్యత తనదేనన్నారు. సీఏం కేసీఆర్ సహకారంతో ఇప్పటి వరకు ములుగు నియోకవర్గాన్ని రూ.4వేల కోట్లతో అభివృద్ధి చేశానని, మళ్లీ ఆశీర్వదిస్తే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. వెంకటాపూర్ మండల కేంద్రంలో రూ.5 కోట్లతో సీసీరోడ్లు అభివృద్ధి చేశానని వివరించారు. మహాకూటమి నాయకుల మాటలు విని కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటు వేస్తే.. తెలంగాణను ఆగం చేసిన వాళ్లమ వుతామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో మాట్లాడుతూ చందూలాల్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, ఇది చేతల ప్రభుత్వం అని మంత్రి అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ను ఢీకొనే దమ్ములేకనే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాకూటమి పేరుతో పొత్తులు పెట్టుకున్నాయన్నారు. ప్రజల కోసం కేసీఆర్ చేస్తున్న మంచి పనులు కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదు. అందుకే కుట్రలు చేస్తుండ్రు. మన వేలితో మన కన్ను పొడిచే ప్రయత్నం జరుగుతోంది, ప్రజలు గమనించాలె అని అన్నారు. కేసీఆర్ రైతుల మేలుకోరి ప్రవేశపెట్టిన రైతుబంధు ఇక్కడ ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు వారి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల్లో గెలిస్తే మన పథకాలన్నీ తొలగించాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.



