అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు పోటీపడాలి
– నరసింహన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
హైదరాబాద్,జనవరి2(జనంసాక్షి): రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. ఈ రెండు దేశంలోనే ముందుండాలని ఆయన కోరుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం రాజ్భవన్‌లో గవర్నర్ నరసింహన్ ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగురాష్ట్రాల ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పలువురు ఆయనను నేరుగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గవర్నర్ నరసింహన్‌ను స్వయంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాణసంచా మోతలు.. ఆకాశాన్ని ముద్దాడిన వెలుగులు.. రహదారిపై కిక్కిరిసన యువత… కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికాయి. అర్థరాత్రి వేళ సమయం 12గంటలు కాగానే… నగరంలో వేడుకల సంరంభం అంబరాన్ని తాకింది. శబ్ద వాయిద్యాలు, ఆటపాటలతో డీజేలు ¬రెత్తించారు. హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి చిన్నారులతో కలసి నూనత సంవత్సర సంబరాల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట ఎస్సీ, ఎస్టీ వసతి గృహంలో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్రమంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
నూతన సంవత్సరాన్ని వెలుగు జిలుగుల మధ్య సరికొత్తగా ఆహ్వానించారు ప్రజలు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి 12గంటలు దాటాక… బాణాసంచా పేలుస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాలను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు యువతను ఉర్రూతలూగించాయి.