అభివృద్ధి మాతోనే సాధ్యం
– భట్టి విక్రమార్క
హైదరాబాద్,జనవరి27(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు.టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ ఉగ్రవాదానికి తెర తీసిందని టీఆర్‌ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క నిప్పులు చెరిగారు. ఆ ధీమాతోనే ఈ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని మంత్రి కేటీఆర్ అంటున్నారని విమర్శించారు. ఓ రకమైన భయాన్ని నగరంలో సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ సెటిలర్లకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ విూట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చేసిందేవిూ లేదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని సైతం టీఆర్‌ఎస్ అడ్డుకుందని విమర్శించారు. ఎంఐఎం, బీజేపీలు మతతత్వ పార్టీలని భట్టి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీల వల్ల హైదరాబాద్ ఇమేజ్ ప్రమాదంలో పడిందని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం ఈ మూడు పార్టీలు తమ ద్వేషపూరిత విధానాన్ని తీవ్రతరం చేస్తాయన్నారు. టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎంలు పరస్పరం అవగాహనతో ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. టీఆర్‌ఎస్ పేరు మారుస్తామని చెప్పి… అంతలోనే ఓ జోకర్లా మారారని తెలంగాణ ఐటీ, పంచయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు. హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం దేశాన్ని కుదిపేస్తున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించలేదని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీకి కోపం వస్తుందనే… సీఎం కేసీఆర్ హెచ్సీయూకు వెళ్లలేదన్నారు. ఇతర పార్టీ నేతలను తన అధికారంతో టీఆర్‌ఎస్ లోబర్చుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలు హైదరాబాద్‌లో సామరస్య వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని, కుట్రలు పన్నుతున్నాయని భట్టివిక్రమార్క తెలిపారు. ఎంఐఎం, బీజేపీ పార్టీలను తరిమికొట్టాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌కు గ్లోబల్ ఇమేజీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. హైదరాబాద్‌కు ఉన్న గ్లోబల్ ఇమేజీని బీజేపీ, ఎంఐఎం పార్టీలు పాడు చేస్తున్నాయన్నారు. సీమాంధ్రులను కేసీఆర్ ఓటింగ్ యంత్రాల్లా చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. అంతేకాదు ఓట్ల కోసం ఎంఐఎం, బీజేపీ వాటి మిత్ర పక్షాలు హైదరాబాదు ప్రజల వద్దకు వచ్చి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ రెండు పార్టీల కోసం ఓటువేస్తే సామరస్యానికే ముప్పే వస్తుందన్నారు. పాలన నుంచి ఈ రెండు పార్టీలను దూరం పెట్టాలని సూచించారు. మతతత్వపార్టీలు ప్రజలను సమానంగా చూడలేవని, ఆయా మతాల వ్యక్తుల కోసం పాటుపడతాయని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలను కబలించి రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడుతోందన్నారు. కాబట్టి గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాదు ప్రజలు మతాల ప్రాతిపదికగా ఓట్లు వేయవద్దని, సుపరిపాలన లక్ష్యంగా ఓటర్లు ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా వుండగా కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ పునర్‌నిర్మాణం సాధ్యమని కాంగ్రెస్ నేతలు అన్నారు. కాంగ్రెస్‌ను వీడిన నేతలు తిరిగి పార్టీలో చేరి గ్రేటర్‌లో గెలుపునకు కృషి చేయాలని విహెచ్, మధుయాష్కీ తదితరులు అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. గ్రేటర్ విజయాన్ని ఆమెకుకానుకగా ఇవ్వాలన్నారు. ప్రజలు నగరంలో ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు. హైదరాబాద్‌ను అభివృద్దిచేసిన ఘనత తమ పార్టీదేనన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే పునర్నిర్మాణం చేసే సత్తా కలిగి ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమతో కలసి రావాలన్నారు. అందుకు తాము కలసికట్టుగా పోరాడుతామని తెలిపారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని మధుయాష్కీ పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదేనన్నారు. ఇప్పుడు గ్రేటర్ అభివృద్దికి కాంగ్రెస్‌తో జతకట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేకులు ఉడతాభక్తిగా సాయం అందించినా దానిని సాకారం చేసిన ఘనత సోనియాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నేతల పాత్ర కీలకమని మధుయాష్కీ అన్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అందరం కలసి పోరాడినా చివరకు ఇచ్చింది మాత్రం సోనియాగాంధీ అన్నారు. కాంగ్రెస్‌తోనేహైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని మధుయాష్కీ అన్నారు. భావి తరాలకు భవిష్యత్తు కావాలంటే కాంగ్రెస్ నాయకత్వం ఉండాలన్నారు. కాంగ్రెస్ హాయాంలోనే నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. తెరాస నాయకుల బెదిరింపులకు భయపడవద్దన్నారు. తెరాస నాయకుల అక్రమాలను, బెదిరింపులను సహించేది లేదని, రాష్ట్రం కేసీఆర్ జాగీరు కాదని అన్నారు. తెరాస నాయకులు ఆంధ్రా ప్రాంతం వారిని ఆనాడు దూషించి ఇప్పుడు వారే ఓట్ల కోసం భాష మారుస్తున్నారని ఆరోపించారు. ఈ 20 నెలల పాలనలో నగర అభివృద్ధికి తెరాస నాయకులు చేసింది ఏవిూ లేదన్నారు. తెరాస హావిూలు నెరవేరాలంటే రూ.20 వేల కోట్లు కావాలని ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి తెస్తారో వారు చెప్పాలన్నారు. మాజీ ఎంపీలు మధుయాస్కీ, పొన్నం ప్రభాకర్‌లు భరత్‌నగర్, శివమ్మనగర్ డివిజన్లల్లో ప్రచారం నిర్వహించారు.