అమరావతి నిర్మాణానికి బలవంతపు వసూళ్లు వద్దు

5

– హైకోర్టు

హైదరాబాద్‌,జనవరి 6(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం నిర్బంధ విరాళాల వసూళ్లపై హైకోర్టు సీరియస్‌ అయింది. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు బుధవారం స్టే విధించింది. విద్యార్థుల నుంచి విరాళాల సేకరణకు సర్క్యులర్‌ ఎలా విడుదల చేస్తారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.  విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్ను కోర్టు కొట్టేసింది. కాగా విద్యార్థుల నుంచి విరాళాల సేకరణను సవాల్‌ చేస్తూ పలువురు బుధవారం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్‌ మోమెషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించింది.  పిటిషన్‌పై  విచారణ జరిపిన హైకోర్టు… విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి విరాళాలు సేకరించడం తగదని, విద్యాశాఖ కమిషనర్‌ ఎలా నిర్ణయం తీసుకుంటారని  ప్రశ్నించింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. కాగా అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఒక్కొక్కరూ రూ.పది రూపాయలు చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి రూ.10 ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ‘మై కేపిటల్‌, మై అమరావతి, మై బ్రిక్‌’ పేరిట ఈ చందాలు వసూలు చేయాలని జిల్లాల విద్యాశాఖ అధికారులకు సర్క్యులర్‌ను పంపారు. అయితే ఇది స్వచ్ఛందమేనని ఇందులో బలవంతం ఏదీ లేదని అధికార పార్టీ నేతలు వివరణ ఇచ్చారు.