అమరావతి రాజధాని ప్రకటనపై ఏపీ ప్రభుత్వం

 

 

 

 

 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిని కొనసాగించాలంటూ అమరావతిలోని వెలగపూడిలో రైతులు 24 గంటల పాటు చేపట్టనున్న నిరాహార దీక్షను ఈరోజు ప్రారంభించారు. అమరావతి రాజధాని సాధన ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రైతులు, విపక్ష సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, లంకా దినకర్‌, సీపీఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరావు సంఘీభావం ప్రకటించారు.

ఉద్యమం 800వ రోజుకు చేరిన సందర్భంగా ప్రజాదీక్ష పేరుతో రేపు ఉదయం 9గంటల వరకు దీక్షను కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా ఉద్యమంలో చనిపోయిన వారికి నాయకులు నివాళులర్పించారు. దీక్షలో నాయకులు మాట్లాడుతూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అమరావతి భూములను అమ్ముతామంటే సహించేది లేదని హెచ్చరించారు. అమరావతి రాజధాని 5న్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు.

ఉద్యమంలో పాల్గొంటున్న పార్టీల నాయకులు, రైతులపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పూనుకుంటుందని ఆరోపించారు. అమరావతి రాజధాని ప్రకటనపై ఏపీ ప్రభుత్వానికి సద్బుద్ధి ఇవ్వాలని కోరుకుంటూ అమరావతి నుంచి తిరుపతి ఆలయం వరకు పెద్ద సంఖ్యలో రైతులు పాదయాత్ర నిర్వహించారు.