అమరావతి రైతులకు అఖిలపార్టీల మద్దతు

24 గంటల దీక్షను విరమింపచేసిన నేతలు
ప్రజల మద్దతు అమరావతితే ఉందన్న నాయకులు
పాదయాత్రకోసం ఉత్తరాంద్ర ఎదురు చూస్తోందన్న సుంకర
శ్మాశానం అన్న భూముల్లోంచి డబ్బులు రాబట్టే పనలిలో జగన్‌
మండిపడ్డ టిడిపి నేతలు ధూళిపాల్ల, ప్రతిపాటి
మద్దతుగా నిలిచిన జనసేన నేతలు
అమరావతి,ఫిబ్రవరి25(జనం సాక్షి): రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 801వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వెలగపూడిలో రైతులు, మహిళలు, రైతు కూలీలు 24 గంటల పాటు అమరావతి ప్రజా దీక్ష చేస్తున్నారు. సామూహిక రైతుల ప్రజా దీక్షకు అఖిలపక్ష పార్టీలు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపాయి. అమరావతి రైతుల దీక్షకు వివిధ ప్రజాసంఘాలు సంఫీుభావం తెలిపాయి. గురువారం ఉదయం 9 గంటలకు నుండి రైతుల దీక్ష కొనసాగుతోంది. రాత్రి తెల్లవార్లు దీక్షా శిబిరంలోనే రైతులు, మహిళలు ఉన్నారు. వందలాది మంది రైతులతో మాజీ ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర దీక్షను విరమింప చేసారు. ఈ సందర్భంగా పాదయాత్ర సమయంలో రైతులకు రాళ్లు పడతాయన్న రాయలసీమలో రైతులపై పూలు పడ్డాయని కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశ్రీ అన్నారు. వెగలపూడిలో రైతుల దీక్ష విరమణ కార్యక్రమంలో సుంకర పాల్గొన్నారు. రైతుల మరో మహాపాదయాత్ర కోసం ఉత్తరాంధ్ర ఎదురు చూస్తోంద న్నారు. రైతులు దీక్షలు చేస్తుంటే ముఖ్యమంత్రి భోగాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. రైతులు రాష్ట్రం కోసం భూములు దారపోశారు.. ప్రధాని ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతికి కట్టుబడి ఉన్నామంటూ బీజేపీ 8 సంవత్సరాలుగా చెబుతోందని.. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమస్య అని.. వెంటనే పరిష్కరించుకోవాలని హితవుపలికారు. సీఎం మోసగాడే, వైసీపీ మంత్రులు సన్నాసులే, మరి కేంద్రం ఏమి చేస్తుందని నిలదీశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా ఉంటుంది అనడంలో సందేహం లేదని సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం మోసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాల నరేంద్ర విమర్శించారు. విభజన తర్వాత ఏపీ చిన్న రాష్ట్రం అయిందన్నారు. అమరావతి రాజధానిగా ఒప్పుకున్న జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేశారని దుయ్యబట్టారు. రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు.. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు, ప్రజలు మహా ఉద్యమాన్ని నడుపుతున్నారన్నారు. అధికారం ఉందని ముళ్ల కంచెలు వేసినా… వాటిని దాటి 800 రోజులుగా ఉద్యమం
చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతిలో ఏముంది? శ్మశానం అని వైసీపీ నేతలు హేళన చేశారని, ఇప్పుడు ఆ శ్మశానాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారా…? అని దూళిపాల నరేంద్ర ప్రశ్నించారు.
సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మొండోడని…. కక్ష సాధింపు తప్ప ఆయన ఏమి చేయరని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు చేశారు. రైతులు చేపట్టిన దీక్ష విరమణ కార్యక్రమంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఫ్యాన్‌కి ఓట్‌ వేసిన వాళ్ళు ఇప్పుడు ఫీల్‌ అవుతున్నారన్నారు. ప్రజా స్పందన చూసి ప్రభుత్వం మారాలని హితవుపలికారు. అరసవల్లి పాదయాత్ర పెడితే ప్రభుత్వానికి విూకు ఉన్న మద్దతు అర్థం అవుతోందన్నారు. కేంద్రంలో కన్నింగ్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ప్రత్తిపాటిపుల్లారావు మండిపడ్డారు. రాజధాని కోసం రైతులు చేపట్టిన దీక్షకు జనసేన మద్దుతు ప్రకటించింది. దీక్ష చేస్తున్న రైతులకు జనసేన నేత పి.మహేష్‌, బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ… అమరావతికి ముందు నుండి జనసేన మద్దతు ఉందన్నారు. మహా పాదయాత్రను ఒక్కరు కూడా అడ్డుకోలేదు అంటే ప్రజల అభిమతం ఎంటో అర్థం అవుతుందని తెలిపారు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్‌ అమరావతి రైతుల చేతుల్లో ఉందన్నారు. రాష్ట్రం పెద్ద ఎత్తున సంక్షోభంలో పడిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో అమరావతి రైతులు ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు